Udhayanidhi Stalin: ఇక సినిమాల్లో నటించను.. ఉదయ నిధి స్టాలిన్ షాకింగ్ నిర్ణయం
Udhayanidhi Stalin: మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను సినిమాల్లో నటించనని తెలిపాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న మామన్నన్ తన చివరి సినిమా అని ప్రకటించాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇకపై సినిమాల్లో నటించను.. అని సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమానే చివరి మూవీ అని తెలిపాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయ నాయకుడే కాకుండా..ప్రఖ్యాత సినీ రచయిత కూడా. తమిళ్ లో వచ్చిన ఎన్నో సినిమాల కోసం ఆయన పనిచేశారు. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనవడు ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పదేళ్ల కిందట ఒరు కాల్ ఒరు కన్నాడి ఉదయనిధి తొలి సినిమా. ఈ సినిమా తెలుగులో ఓకే ఓకే పేరుతో విడుదలైంది.
ఉదయనిధి సినిమాల్లో నటిస్తూనే తన తండ్రి స్టాలిన్ కు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించడంతోపాటు చెన్నైలోని చేపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉదయనిధి కూడా మంత్రి అవుతారంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగాడు.
ఇటీవల ఉదయనిధి తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను సినిమాల్లో నటించనని తెలిపాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న మామన్నన్ తన చివరి సినిమా అని ప్రకటించాడు. అలాగే కమల్ హాసన్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపాడు. తాను రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నానని, తనను గెలిపించిన నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నానని ఉదయనిధి చెప్పాడు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించాడు.