Telugu Global
National

బీజేపీని మళ్ళీ కెలికిన ఉదయనిధి

అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. హిందీ భాష దేశాన్ని ఏ విధంగా ఏకం చేస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

బీజేపీని మళ్ళీ కెలికిన ఉదయనిధి
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఇంకా ప్రజానాయకుడిగా ఎదగనప్పటికీ తమిళనాడులో మాత్రం కుటుంబపరంగా వచ్చిన గుర్తింపు కొంతమేర ఉంది. ఆ గుర్తింపుతోనే తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గాడు. అయితే ఇటీవల ఉదయనిధి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాడు. కొద్ది రోజుల కిందట సనాతన ధర్మం గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవాళ హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ గొప్పతనం గురించి మాట్లాడారు. హిందీ భారతీయ భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, అది వివిధ దేశ భాషలు, ప్రపంచ భాషలను, మాండలికాలను గౌరవించిందని అన్నారు. హిందీ దేశంలోని భాషల్ని బలోపేతం చేసినందువల్లే దృఢమైన దేశానికి పునాదులు పడ్డాయని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. హిందీ భాష దేశాన్ని ఏ విధంగా ఏకం చేస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు హిందీపై ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయని ఉదయనిధి అన్నారు. హిందీ చదివితేనే ముందుకెళ్తామని అమిత్ షా గట్టిగా అరిచి చెప్పినట్లు ఉందని విమర్శించారు.

తమిళనాడులో తమిళం మాట్లాడతారు.. కేరళలో మలయాళం మాట్లాడతారు.. మరి హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుందని, సాధికారత ఎక్కడ వస్తుందని ఉదయనిధి ప్రశ్నించారు. హిందీ దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడతారని, అది దేశం మొత్తాన్ని ఏకం చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఉదయనిధి విమర్శించారు. హిందీ భాషను పొగిడేముందు అమిత్ షా ప్రాంతీయ భాషలను కించపరచడం మానేయాలని హితవు పలికారు.

కాగా, అమిత్ షాపై ఉదయనిధి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సనాతన ధర్మం గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. బీజేపీ నాయకులు ఉదయనిధిని టార్గెట్ చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అమిత్ షాపై, హిందీ భాషపై ఉదయనిధి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి ఆయన బీజేపీకి టార్గెట్‌గా మారనున్నారు.


First Published:  14 Sept 2023 9:55 PM IST
Next Story