ఏకతాటిపైకి ఉద్ధవ్ థాక్రే, ప్రకాష్ అంబేద్కర్.. మహారాష్ట్రలో మరో కూటమి..!
ఎన్నికలు ఈ రోజు ప్రకటించినా అంతా ఏకమవుతారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం ఒక స్టే ఆర్డర్ పై నడుస్తున్నది. ఇది రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు దెబ్బ. సుప్రీంకోర్టు వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి
దేశంలో బీజేపీ హయాంలో పెరుగుతున్న నియంతృత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే శివసేన, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ- భీమ్ శక్తి , ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కలిసి కూటమిగా మహారాష్ట్రలో మరో కొత్త రాజకీయ ప్రయోగానికి చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు.
ప్రబోధంకర్ వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ మాట్లాడుతూ.. "మన దేశం పోకడ నియంతృత్వం వైపు సాగుతున్నది. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడేవారితో చేతులు కలుపడానికి తాము సిద్ధంగా ఉన్నామని" థాక్రే అన్నారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఇప్పుడు ఏకమవ్వకపోతే మన తాతల వారసత్వం గురించి మాట్లాడే హక్కు మనకు ఉండదు. సమాజంలోని అసమానతను చూస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఊరికే కూర్చోలేదు. ప్రజలను ఏకం చేసి నియంత పాలకులపై ఎదురుతిరిగి పోరాడారు. మా తాత ప్రబోధంకర్ కూడా సమాజంలోని దురాచారాల గురించి రాశారు. పోరాడారు' అని థాక్రే పేర్కొన్నారు.
ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలకు ప్రకాష్ అంబేద్కర్ స్పందిస్తూ.. ఎన్నికలు ప్రకటించిన తర్వాతే ఒకచోటికి రావచ్చు. 'ఎన్నికలు ఈ రోజు ప్రకటించినా అంతా ఏకమవుతారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం ఒక స్టే ఆర్డర్ పై నడుస్తున్నది. ఇది రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు దెబ్బ. సుప్రీంకోర్టు వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి' అని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలో వంచిత్ బహుజన్ అగాదీ- భీమ్ శక్తి పని చేస్తోంది. దీనికి విదర్బ రీజియన్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా దళిత ఓటర్ల నుంచి మద్దతు ఎక్కువ ఉన్నది. కాగా, ఉద్ధవ్ థాక్రేకు హిందూ ఓటర్ల బలం ఉండనే ఉన్నది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో వంచిత్ బహుజన్ అఘాడీ 14 శాతం ఓటు శాతాన్ని సాధించింది. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీలు పది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇందులో నాందేడ్ నుంచి మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా ఉన్నారు. రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కాగా ఉద్ధవ్ థాక్రే సంఘ సంస్కర్త ప్రభోదంకర్ థాక్రే మనవడు. ప్రబోధంకర్ శివసేనను మరాఠాల కోసం స్థాపించగా.. దాన్ని ఆయన కొడుకు బాలాసాహెబ్ థాక్రే నడిపించారు.