Telugu Global
National

కర్నాటక ఆక్రమిత మహారాష్ట్రను కేంద్రపాలితం చేయండి..

మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దులో వివాదాస్పదంగా మారిన ప్రదేశాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఉద్ధవ్ సేన అధినేత మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు.

కర్నాటక ఆక్రమిత మహారాష్ట్రను కేంద్రపాలితం చేయండి..
X

కర్నాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు సమస్య రోజు రోజుకీ పెరిగి పెద్దదవుతోంది. కర్నాటక ఆక్రమిత మహారాష్ట్ర అంటూ పీఓకే స్థాయిలో మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. ఆ భూభాగాన్ని వెంటనే తమకిచ్చేయాలంటున్నారు. ఏళ్లతరబడి కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పుడు రాజకీయ కారణాలతో మళ్లీ భగ్గుమంది, ఈసారి ఇది మరింత శృతి మించింది. ఏకంగా రెండు రాష్ట్రాల మధ్య రవాణా కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొంది.

కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేయండి..

మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దులో వివాదాస్పదంగా మారిన ప్రదేశాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఉద్ధవ్ సేన అధినేత మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. శాసన మండలిలో ఆవేశంగా ప్రసంగించిన ఉద్ధవ్.. ఇది కేవలం భాష, సరిహద్దు వివాదం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారు తర తరాలుగా నివశిస్తున్నారని.. వారి భాష, జీవన విధానం మరాఠీయేనని స్పష్టం చేశారు ఉద్ధవ్‌ థాక్రే. ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందని, అందుకే ఇప్పుడు కర్నాటక ఆక్రమిత మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్నారాయన.

ఏక్ నాథ్ మౌనమేల..?

సరిహద్దు వివాదంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నోరు మెదపడంలేదనేది అక్కడి ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఆయన వెంటనే నోరు విప్పాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు ఉద్ధవ్ థాక్రే. ఇప్పటికే కర్నాటక అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసిందని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేయలేకపోతోందని విపక్ష నేత అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు. కర్నాటక సీఎం చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు పవార్. విపక్షాల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. అంగుళం భూమి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. ఏక్ నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, అందుకే తీర్మానం ప్రవేశ పెట్టలేదని, త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెడతామన్నారు.

First Published:  26 Dec 2022 5:52 PM IST
Next Story