శివసేన గుర్తు విల్లు - బాణం చోరీ.. షిండేపై ఉద్దవ్ సంచలన ఆరోపణలు
ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ ఈ విధంగా పనిచేసింది లేదని మండిపడ్డారు. షిండే వర్గం శివసేన గుర్తు అయిన విల్లు - బాణంను చోరీ చేసిందని మండిపడ్డారు. ఆ నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపు తీసుకుంటున్నాయి. గత ఎన్నికల సమయంలో పొత్తుల వద్ద నుంచి, ఆ తర్వాత అధికారం ఏర్పాటు చేసే విషయంలో శివసేన నుంచి షిండే వర్గం వేరుపడి అధికారం దక్కించుకునే వరకు అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షిండే శివ సేన వర్గానికి పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే శివసేన పార్టీ గుర్తును షిండే వర్గానికి కేటాయించడంపై మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ గుర్తును షిండే వర్గం చోరీ చేసిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
శివసేన నుంచి షిండే వర్గం వేరుపడి బీజేపీ సహాయంతో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ పేరు, గుర్తును దక్కించుకునేందుకు ఉద్దవ్ థాక్రే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. షిండే వర్గమే అసలైన శివసేన అని ప్రకటించిన ఈసీ పార్టీ గుర్తును కూడా ఆ వర్గానికే కేటాయించింది. దీనిపై ఉద్దవ్ థాక్రే వర్గం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవాళ ఉద్దవ్ థాక్రే తన నివాసం అయిన మాతోశ్రీ వద్ద మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, కొందరికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ ఈ విధంగా పనిచేసింది లేదని మండిపడ్డారు. షిండే వర్గం శివసేన గుర్తు అయిన విల్లు - బాణంను చోరీ చేసిందని మండిపడ్డారు. ఆ నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మండే కాగడాతో షిండే వర్గాన్ని ఎదుర్కొంటామన్నారు.
పార్టీ గుర్తు కోల్పోయినప్పటికీ కార్యకర్తలు చింతించాల్సిన అవసరం లేదని, ఓపిక పట్టాలని సూచించారు. వచ్చే రోజులన్నీ మనవేనన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కొన్ని నెలల కిందట ఈసీ ఉద్దవ్ థాక్రే వర్గానికి మండే కాగడా గుర్తుగా కేటాయించింది. త్వరలో రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల వరకు ఈ గుర్తుపైనే ఉద్దవ్ థాక్రే వర్గం ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి షిండే కూడా స్పందించారు. విల్లు - బాణం గుర్తు తమ వర్గానికి దక్కడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఉద్దవ్ థాక్రే ఇప్పటికైనా ఆత్మ పరిశీలన జరుపుకోవాలని సూచించారు.