ఉదయనిధి తలకు రూ.10కోట్ల బహుమతి.. అర్చకుడి సంచలన ప్రకటన
ఉదయనిధి ఫొటోని చేతిలో పట్టుకుని ఆయన తల తెచ్చిచ్చిన వారికి బహుమతిస్తానంటూ ప్రకటించారు పరమహంస. ఎవరూ ఆ పని చేయకపోతే తానే ఉదయనిధి జాడ కనుక్కుని ఆయన తల నరికి వేస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, అంతకు మించి అన్నట్టుగా హిందూ సంఘాల్లో కొంతమంది నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే వారికి 10 కోట్ల రూపాయల బహుమతి ఇస్తానంటూ ఓ అర్చకుడు చేసిన ప్రకటనతో తాజాగా కలకలం రేగింది. ఉత్తర ప్రదేశ్ లోని తపస్విచావిని ఆలయ ప్రధాన ఆర్చకుడు పరమహంస ఆచార్య ఈ సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి ఫొటోని చేతిలో పట్టుకుని ఆయన తల తెచ్చిచ్చిన వారికి బహుమతిస్తానంటూ ప్రకటించారు పరమహంస. ఎవరూ ఆ పని చేయకపోతే తానే ఉదయనిధి జాడ కనుక్కుని ఆయన తల నరికి వేస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బీజేపీకి ఇది అనుకోని అస్త్రంలా మారింది. ఉదయనిధి వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని 'ఇండియా' కూటమిపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలకు అనుకూలమా, వ్యతిరేకమా తేల్చి చెప్పాలంటోంది. మరోవైపు హిందూ సంఘాలు కూడా పరోక్షంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నాయి. 'ఇండియా' కూటమిలో ఉన్న డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై ఆ కూటమి నేతలు స్పందించాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలకు బీజేపీ రాజకీయ రంగు పులిమింది, దీన్ని పూర్తిగా రాజకీయం చేయాలని చూస్తోంది. అయితే రాజకీయాలకు అతీతంగా 'ఇండియా' కూటమి నేతలు కూడా ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇతర మతాల ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించాల్సిన దేశం మనది అని చెప్పారు మమతా బెనర్జీ. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ లక్షణమన్నారు. ఏ ఒక్కరూ ఏ వర్గం వారినీ బాధించకూడదని చెప్పారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని అన్నారు మమతా బెనర్జీ.
ఉదయనిధి రియాక్షన్..
తన తల నరికి తేవాలంటూ ఉత్తరప్రదేశ్ అర్చకుడు చేసిన వ్యాఖ్యల్ని తేలిగ్గా కొట్టిపారేశారు ఉదయనిధి స్టాలిన్. తల దువ్వుకోడానికి తనకు 10 రూపాయల దువ్వెన చాలని, 10కోట్లు అక్కర్లేదన్నారు. బెదిరింపులు తమ కుటుంబానికి కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని అన్నారాయన. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని అన్నారు. మొత్తమ్మీద ఉదయనిధి వ్యాఖ్యలు తదనంతర పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. దీనికి ముగింపు ఎప్పుడో వేచి చూడాలి.