కోర్టుకు చేరిన మహిళా ఐఏఎస్, ఐపీఎస్‌ల వివాదం
రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని ఈ సందర్భంగా ప్రచార మాధ్యమాలను కూడా న్యాయస్థానం ఆదేశించింది.
కర్నాటక కేడర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య కొనసాగుతున్న వివాదం కోర్టుకు చేరింది. తనపై వ్యాఖ్యలు చేయకుండా ఐపీఎస్ అధికారిణి రూప డి.మౌద్గిల్‌ను నిరోధించాలంటూ ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలూ, ఆరోపణలూ చేయొద్దని ఆదేశించింది. బెంగళూరు 74వ సిటీ సివిల్ న్యాయస్థానం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని ఈ సందర్భంగా ప్రచార మాధ్యమాలను కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఐజీపీ రూప డి.మౌద్గిల్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.