పోలీసులమంటూ బెదిరించి బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్టు
ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఓ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలో నిందితుల కదలికలు నమోదు కాగా ఆ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసులమంటూ బెదిరించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని థానేలో 17 ఏళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం తన ప్రియుడితో కలిసి కళ్యాణ్ లోని డోంబివలీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో వారి వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమంటూ బెదిరించారు. ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో యువకుడిపై దాడి చేశారు.
ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లగా.. మరొక వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత యువకుడిని వదలడానికి వెళ్లిన మరో వ్యక్తి తిరిగొచ్చాక బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి బయటపడిన బాలిక ఇంటికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సహాయంతో థానే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఓ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలో నిందితుల కదలికలు నమోదు కాగా ఆ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తులను థానేకు చెందిన విష్ణు ఎస్ భండేకర్, ఆశిష్ పి గుప్తాగా గుర్తించారు. వీరిలో భండేకర్ కూలి పనులు చేసుకుంటుండగా, గుప్తా టీ స్టాల్ లో పనిచేస్తున్నాడు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు ఇతర కేసులను నమోదు చేశామని, వారిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్లు సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పండరినాథ్ భాలే రావు తెలిపారు.