Telugu Global
National

ప్రపంచంలోనే అతి పెద్ద గంట.. అచ్చు తెరుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

కోచింగ్ సెంటర్‌లకు పేరెన్నికగల కోటాను సుందరంగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవలే చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌ను నిర్మించారు. దీనిని రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆర్భాటంగా ప్రారంభించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద గంట.. అచ్చు తెరుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
X

ఒక్కోసారి ప్రమాదం ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాజస్థాన్‌లో జరిగిన ఘ‌ట‌న‌ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. కోటా జిల్లాలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద గంటను బిగించడానికి నిర్ణయించింది. ఈ నది ముందు భాగంలో 80,000 కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధం చేశారు. దీని శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. అలాగే ఇది 5000 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటుందని, ప్రపంచంలోనే అతి పెద్ద గంట అని ప్రకటించారు. అయితే గంటను అచ్చు నుంచి బయటికి తీస్తుండగా ప్రమాదం జరిగింది. గంట పైనుంచి పైన ఉన్న ఓ ఇంజినీర్ సహా మరో కార్మికుడు కిందపడ్డారు. కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆ ఇంజినీర్ ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా మరణించాడు.


కోచింగ్ సెంటర్‌లకు పేరెన్నికగల కోటాను సుందరంగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవలే చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌ను నిర్మించారు. దీనిని రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్గం అంతా తరలివచ్చింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గంటను తయారు చేశారు. దీనిని విడతాలవారీగా ఒక్కో దగ్గరికి మారుస్తూ చివరి అంకానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే గంటను అచ్చు పెట్టె నుంచి తియ్యడానికి 35 అడుగుల పైకెక్కిన ఇంజినీర్ దేవేంద్ర ఆర్య, మ‌రో కార్మికుడు అక్కడినుంచి జారి కింద పడిపోయారు.

ఈ ఘటనలో ఒక కార్మికుడు అక్కడికక్కడే చనిపోగా.. దేవేంద్రను ఆస్ప‌త్రికి తరలించేలోపే మరణించాడు. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First Published:  20 Nov 2023 6:49 PM IST
Next Story