ఒక కిలోమీటర్ ప్రయాణానికి రెండు గంటలు.. ట్రాఫిక్‌లో చిక్కుకొని పిజ్జాలు తెప్పించుకున్నారు!
సాయంత్రం 3.30కు స్కూల్ అయిపోయిన తర్వాత బస్సులు, ఇతర వాహనాలు ఎక్కిన విద్యార్థులు ఏకంగా రాత్రి 9 దాటిన తర్వాత ఇళ్లకు చేరారంటే ట్రాఫిక్ ఎంత దారుణంగా జామ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
సిగ్నల్ దగ్గర ఒక నిమిషం ఆగడానికి చాలా మంది చిరాకు పడుతుంటారు. అలాంటిది ఒక కిలోమీటర్ ప్రయాణానికి రెండు గంటల సమయం పడితే అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? బంపర్ టూ బంపర్ ట్రాఫిక్ అంటారే.. దాన్ని మించిన జామ్ ఐటీ సిటీలో ఏర్పడింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్రిడ్ లాక్ అయినట్లుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఔటర్ రింగ్‌రోడ్, మరతహల్లి, సర్జాపుర ప్రాంతాల మధ్య ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజానీకం అల్లాడిపోయారు.
సాయంత్రం 3.30కు స్కూల్ అయిపోయిన తర్వాత బస్సులు, ఇతర వాహనాలు ఎక్కిన విద్యార్థులు ఏకంగా రాత్రి 9 దాటిన తర్వాత ఇళ్లకు చేరారంటే ట్రాఫిక్ ఎంత దారుణంగా జామ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపై కనుచూపు మేరలో వాహనాలతో కిక్కిరిసి పోయింది. ఇంత దారుణమైన ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. అప్పటికే ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సందేశాలు పంపారు. తాము చెప్పే వరకు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని.. అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటారని హెచ్చరించారు.
ఓఆర్ఆర్ చుట్టు పక్కల ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలు వదిలి రావొద్దని సూచించినట్లు బెంగళూరు వెస్ట్ డిప్యుటి కమిషనర్ కుల్దీప్ కుమార్ చెప్పారు. బెంగళూరు ట్రాఫిక్ అప్‌డేట్లతో సోషల్ మీడియా కూడా నిండిపోయింది. ఎక్స్(ట్విట్టర్)లో తమ పరిస్థితిని వివరిస్తూ చాలా మంది పోస్టులు పెట్టారు. ఇక కొంత మంది ఆకలిని తట్టుకోలేక ఆన్‌లైన్‌లో పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకున్నారు. డెలివరీ బాయ్స్ అయితే సందుల్లో నుంచి బైకులు వేసుకొని, నడుచుకుంటూ వచ్చి వారికి ఫుడ్ డెలివరీ చేసి వెళ్లారు. ఇంత దారుణమైన ట్రాఫిక్ జామ్‌ను ఇటీవల కాలంతో తాము చూడలేదని చాలా మంది సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
కావేరీ నీటి సమస్యపై బెంగళూరు బంద్‌కు పిలుపునివ్వడంతో మంగళవారం ఆఫీసులు, స్కూల్స్ పని చేయలేదు. ఆ తర్వాతి రోజు బెంగళూరులో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందు రోజు బంద కారణంగా బయటకు రాని వాళ్లు కూడా ఒకే సారి రావడంతోనే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు చెప్పారు. మరోవైపు లాంగ్ వీకెండ్ ఉండటంతో త్వరగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచనతో చాలా మంది సాయంత్రం కార్యాలయాల నుంచి బయటకు వచ్చేశారని.. అందుకే జామ్ మరింతగా పెరిగిందని అంటున్నారు.
ఇక నగరంలో ప్రముఖ కమెడియన్ ట్రెవర్ నోవా షో కూడా క్యాన్సిల్ అయ్యింది. సౌండ్ సిస్టమ్ పని చేయకపోవంతో షోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు కూడా ఒకే సారి రోడ్డెక్కారు. ఇది కూడా జామ్‌కు ఒక కారణంగా భావిస్తున్నారు. మొత్తానికి బెంగళూరు ట్రాఫిక్ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది.
Bengaluru roads choked with unusual traffic#BengaluruTraffic #ORR, #Marathahalli, #Sarjapura #Commuters #bangaloretraffic #Bellandur #RMZ pic.twitter.com/koBIhl6I0T
— Madhuri Adnal (@madhuriadnal) September 27, 2023
When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz
— Rishivaths (@rishivaths) September 27, 2023