రామ మందిరం, సీఎం యోగిని పేల్చేస్తామంటూ బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్
అయోధ్యలోని రామ మందిరాన్ని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చి వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ మందిరం నిర్మాణం పూర్తవడంతోపాటు ఈనెల 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానాలు సైతం అందాయి.
ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం సహా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి భారీగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
అయోధ్యలోని రామ మందిరాన్ని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చి వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగితోపాటు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌ను కూడా చంపేస్తామంటూ వారు బెదిరించారు. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఈ పోస్ట్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్ అడ్రస్సులను కనుగొన్నారు. గోండాకు చెందిన ఓం ప్రకాష్, తాహర్ సింగ్ బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు పారామెడికల్ ఇనిస్టిట్యూట్ లో ఉద్యోగం చేస్తున్నారు. తాహర్ సింగ్ మెయిల్స్ సృష్టించగా.. ప్రకాష్ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామని ఎందుకు బెదిరించారు? వీరి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో ఇటువంటి బెదిరింపులు రావడం అయోధ్యలో కలకలం సృష్టించింది.