ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగింపు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖుల ఖాతాలకు కూడా ఇప్పుడు బ్లూటిక్ తొలగించడం గమనార్హం. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించినవారికి మాత్రమే ఈ బ్లూటిక్ ను ఆ సంస్థ కొనసాగించనుంది.
ట్విట్టర్ అధికారిక ఖాతాలకు ఇచ్చే `బ్లూ టిక్` కు చార్జీల విధానం తీసుకొచ్చిన దాని యజమాని ఎలాన్ మస్క్.. ఇప్పుడు చార్జీలు చెల్లించని వారి ఖాతాలకు బ్లూ టిక్ తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. గురువారం నుంచే దీనిని చేపట్టారు. ఇందులో భాగంగా డబ్బు చెల్లించని సెలబ్రిటీల ఖాతాలకు కూడా బ్లూటిక్ తొలగించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖుల ఖాతాలకు కూడా ఇప్పుడు బ్లూటిక్ తొలగించడం గమనార్హం. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించినవారికి మాత్రమే ఈ బ్లూటిక్ ను ఆ సంస్థ కొనసాగించనుంది.
భారత్‌లోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా బ్లూటిక్ కోల్పోయినవారిలో ఉన్నారు. వారిలో ప్రముఖంగా ఏపీ, పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, మమతా బెనర్జీ, యోగీ ఆదిత్యనాథ్, భగవంత్ మాన్, కేజ్రీవాల్ ఉన్నారు. ప్రతిపక్ష నేతల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకు కూడా బ్లూటిక్ తొలగించారు.
సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, దీపికా పదుకొనె, ఆలియాభట్, క్రీడారంగంలో సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మ, సెహ్వాగ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తదితరులు కూడా బ్లూటిక్ తొలగించినవారిలో ఉన్నారు.
బ్లూటిక్ సేవలను పొందాలంటే వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చందాదారులకు తక్కువ ప్రకటనలు చూసే వెసులుబాటు, లెన్తీ వీడియోలను పోస్ట్ చేసుకోవడం వంటి అవకాశాలు కల్పించారు. మరి దీనిపై ట్విట్టర్ యూజర్లు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.