సరోగసీ ద్వారా పిల్లలు.. చిక్కుల్లో నయన్ దంపతులు
నయనతార దంపతులు తల్లిదండ్రులైనట్లు వార్తలు వైరల్ అయిన వెంటనే నటి కస్తూరి ఒక ట్వీట్ చేసింది. అందులో 2022 జనవరిలోనే మన దేశంలో సరోగసీ విధానాన్ని నిషేధించారని ఆమె పేర్కొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగింది.
కవల పిల్లలకు తల్లిదండ్రులం అయ్యామని నయనతార దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విఘ్నేష్ శివన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కవల పిల్లలతో కలసి నయనతార, విఘ్నేష్ దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అయితే నయనతార దంపతుల పెళ్లి జరిగి నాలుగు నెలలే అయ్యింది. వీరు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కన్నారని వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.
నయనతార దంపతులు తల్లిదండ్రులైనట్లు వార్తలు వైరల్ అయిన వెంటనే నటి కస్తూరి ఒక ట్వీట్ చేసింది. అందులో 2022 జనవరిలోనే మన దేశంలో సరోగసీ విధానాన్ని నిషేధించారని ఆమె పేర్కొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగింది. నయనతార అభిమానులు కస్తూరిని ట్రోల్స్ చేయగా.. మరి కొందరు నెటిజన్లు మాత్రం నయనతార దంపతులు అనుమతి పొందే సరోగసీ ద్వారా పిల్లలను కన్నారా? అన్న ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో నయనతార కవల పిల్లల వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. పిల్లలు ఎలా పుట్టారో తెలుపుతూ వివరాలు అందజేయాలని ప్రభుత్వం నయనతార దంపతులను కోరింది. దీనిపై వారికి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ ప్రక్రియ జరిగిందా.. లేదా.. అనే విషయమై తమిళనాడు ప్రభుత్వం ఆరా తీస్తోంది.
దేశంలో సరోగసీ విధానాన్ని ప్రస్తుతం అనుమతించడం లేదు. గర్భం దాల్చలేని పరిస్థితి ఉన్న వారికి మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలు కనడానికి అనుమతి ఇస్తున్నారు. అనుమతి లేకుండా అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు కావడం నేరం కిందకు వస్తుంది. నయనతార దంపతులు అనుమతి తీసుకోకుండా సరోగసీ విధానం ద్వారా పిల్లలను కని ఉంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.