Telugu Global
National

పఠాన్ పై ద్వేషం.. కేరళ స్టోరీపై ప్రేమ.. ఏంటీ వివక్ష?

తాజాగా ఈ సినిమా విషయంలో సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. చిన్న చిన్న కారణాలతో కొన్ని సినిమాలను అడ్డుకున్న బీజేపీ, ఇప్పుడు కేరళ స్టోరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ఎందుకు తప్పుబడుతోందన్నారు కపిల్ సిబల్.

పఠాన్ పై ద్వేషం.. కేరళ స్టోరీపై ప్రేమ.. ఏంటీ వివక్ష?
X

దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు 'ది కేరళ స్టోరీ' సినిమా గురించే చర్చ నడుస్తోంది. బీజేపీ ఈ సినిమాకి ఉచిత ప్రచారం చేస్తోంది. మరోవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ సినిమా ప్రదర్శనపై ఆంక్షలు విధించాయి. దీంతో ఈ సినిమాకి ఎక్కడలేని హైప్ వచ్చింది. సమాజంలో మతచిచ్చు పెట్టే ఇలాంటి సినిమాలను నిషేధించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోర్టులు మాత్రం నిషేధానికి, ప్రదర్శనపై ఆంక్షలు విధించడానికి ససేమిరా అన్నాయి. ఆ తర్వాత ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ సినిమాపై ఆంక్షలు విధించాయి.

తాజాగా ఈ సినిమా విషయంలో సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఈ సినిమాలో చాలామందికి తెలియని నిజాలు చూపించారని, నిర్మొహమాటంగా అన్ని విషయాలు చెప్పారని ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై కపిల్ సిబల్ మండిపడ్డారు. ప్రజలు ఏం చూడాలో వారే నిర్ణయించుకుంటారని, ఖుష్బూ చెప్పాల్సిన పనిలేదన్నారు కపిల్ సిబల్. పీకే, పఠాన్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలను బీజేపీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు. వాటిపై విషం చిమ్మిన బీజేపీ, కేరళ స్టోరీపై ఎందుకంత ప్రేమ కురిపిస్తోందని అన్నారు. చిన్న చిన్న కారణాలతో కొన్ని సినిమాలను అడ్డుకున్న బీజేపీ, ఇప్పుడు కేరళ స్టోరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ఎందుకు తప్పుబడుతోందన్నారు కపిల్ సిబల్.


కపిల్ జీ...!

కపిల్ సిబల్ ట్వీట్ కి ఖుష్బూ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏ సినిమానీ నిషేధించలేదని గుర్తు చేశారు. కపిల్ సిబల్ అసత్యాలకు మద్దతు తెలుపుతున్నారని అన్నారామె. కపిల్ సిబల్ చెప్పిన సినిమాల విషయంలో కొంతమంది ఆందోళనలు చేపట్టిన విషయం నిజమేనని, వాటికి, బీజేపీకి ముడి పెట్టడం సరికాదన్నారామె.

First Published:  9 May 2023 7:59 PM IST
Next Story