Telugu Global
National

మోదీ మార్కు ధ్యానం.. మోతమోగిపోతున్న ట్రోలింగ్

మోదీ ధ్యానం మొదలు పెట్టినట్టుగా వచ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మోదీ మార్కు ధ్యానం.. మోతమోగిపోతున్న ట్రోలింగ్
X

ప్రధాని మోదీ ఏం చేసినా అందులో ప్రచార కోణం దాగి ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. మోదీ బయటకు వచ్చారంటే చాలు, ఆయన ప్రతి కదలిక కెమెరాలకు ఫేవర్ గా ఉంటుంది. ఒక్కో సమయంలో ఆయన కెమెరాలకు అడ్డొచ్చే వారిని లాగి అవతలపారేయడం కూడా అదే కెమెరాల్లో రికార్డ్ అయిన సందర్భాలున్నాయి. మొత్తంగా కెమెరాలకు ఫోజులివ్వడంలో, ఆ ఫోజుల్ని ప్రచారానికి వాడుకోవడంలో మోదీని మించిన వారెవరూ భారత్ లో లేరని అంటుంటారు. గురువారం ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న మోదీ అదే రోజు సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో మునిగిపోయారు. 48గంటలపాటు మోదీ ధ్యానంలో ఉంటారని సమాచారం. అయితే మోదీ ధ్యానం మొదలు పెట్టినట్టుగా వచ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.


ట్రోలింగ్ మొదలు..

మోదీ మార్కు ధ్యానం ఎలా ఉంటుందో తెలుసుకున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. "ధ్యానం చేసేటప్పుడు ఇలా కెమెరాలతో రికార్డ్ చేయాలని తెలియక ఇంట్లో మామూలుగా చేసేస్తున్నా భయ్యా! ఇన్ని రోజులు మనం చేసింది వృధా అన్నమాట." అంటూ కొందరు నెటిజన్లు మోదీని ఆటాడేసుకుంటున్నారు.


360 డిగ్రీస్ వీడియో..

వివేకానంద రాక్ మెమోరియల్ లో సాధారణంగా కెమెరాలకు అనుమతి ఉండదని, కానీ మన ప్రధాని ఎంటరయ్యాక 360 డిగ్రీస్ వీడియో రికార్డింగ్ మొదలైందని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల ప్రచారం అనంతరం మోదీకి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం అలవాటు. 2014లో ఎన్నికల ప్రచారం పూర్తయ్యాక మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌ గఢ్‌కు వెళ్లారు మోదీ. 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్‌నాథ్‌ సందర్శించారు. ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఆయన ఉద్దేశం ఏదయినా.. యాత్రల పరమార్థం మాత్రం ప్రచారమేనని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

First Published:  31 May 2024 6:23 AM GMT
Next Story