అమిత్ షా, మహా రాష్ట్ర CM, Dy. CM పాల్గొన్న సభలో విషాదం...13 మందిమృతి, 600 మందికి అస్వస్థత
నవీ ముంబైలోని భారీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లనుండి అప్పాసాహెబ్ ధర్మాధికారి అనుచరులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అవార్డు ప్రదానోత్సవం మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది.
ఆదివారం ముంబైలో జరిగిన భూషణ్ అవార్డు కార్యక్రమంలో వడదెబ్బ కారణంగా 13 మంది మరణించగా 600 కు పైగా ప్రజలు అస్వస్థత గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డును సామాజిక కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి హోంమంత్రి అమిత్ షా అందజేశారు. ఈ కార్యక్రమం నవీ ముంబైలో జరిగింది, ఇక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
నవీ ముంబైలోని భారీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లనుండి అప్పాసాహెబ్ ధర్మాధికారి అనుచరులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అవార్డు ప్రదానోత్సవం మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది.
మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు కూర్చున్న చోట పైన ఎలాంటి షెడ్ గానీ, టెంట్ గానీ వేయలేదు. గంటల తరబడి మండుటెండలో కూర్చోవడం వల్ల ఈ విషాదం సంభవించింది. ఒక్క వీఐపీలు కూర్చున్న చోట మాత్రం పైన షెడ్ వేశారు.
ఆస్పత్రిలో చేరిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, బాధితులు చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళి వారిని పరామార్శించారు.
ఈ సంఘటనను దురదృష్టకరం అని పేర్కొన్న షిండే మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
"వైద్యుల నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ రోజు 7-8 మంది మరణించారు, 24 మంది చికిత్స పొందుతున్నారు. ఇది వడదెబ్బ కేసు. దాదాపు 50 మంది ఆసుపత్రిలో చేరారు, వారిలో 24 మంది ఇంకా చికిత్స పొదుతున్నారు. మిగిలిన వారు ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు" అని షిండే మీడియాతో అన్నారు.
ఒక్క ఎంజీఎం ఆస్పత్రిలోనే కాక అనేక మంది బాధితులు పన్వేల్ జిల్లా ఆసుపత్రి, వాషిలోని ఎన్‌ఎంఎంసి, ఫోర్టిస్, నెరూల్‌లోని డివై పాటిల్ ఆసుపత్రి, కామోతే, బేలాపూర్‌లోని ఆసుపత్రులు, టాటా క్యాన్సర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు.
వడదెబ్బతో బాధపడుతున్న వారి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
"ఈ ఉదయం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న కొందరు వడదెబ్బ కారణంగా మరణించడం చాలా దురదృష్టకరం వారి కుటుంబాల బాధను మేము పంచుకుంటున్నాము" అని ఫడ్నవిస్ ట్వీట్ చేశారు.