Telugu Global
National

రాహుల్ పాదయాత్ర రూట్ మార్చాల్సిందే.. పట్టుబడుతున్న రేవంత్ రెడ్డి

మరో ఏడాదిలో తెలంగాణలో సార్వ‌త్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటే బాగుంటుందని టీపీసీసీ రేవంత్ అంటున్నారు.

రాహుల్ పాదయాత్ర రూట్ మార్చాల్సిందే.. పట్టుబడుతున్న రేవంత్ రెడ్డి
X

కాంగ్రెస్ పార్టీకి పుర్వ‌వైభవం తీసుకొని రావాలని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కనీసం అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కూడా కాంగ్రెస్‌ భయపడుతుందని గులాం నబీ ఆజాద్ ఆరోపించి మరీ పార్టీని వదిలేశారు. ఆ పార్టీని ఇప్పుడు ఆదుకునే సీనియర్ నాయకులంటూ ఎవరూ కనపడటం లేదు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవిని వదిలేసిన రాహుల్ గాంధీనే.. ఒక పెద్ద బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. తొలి విడతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు.

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ 'భారత్ జోడో' పాదయాత్ర 150 రోజుల పాటు సాగనుంది. తమిళనాడు, కేరళ, కర్నాటక తర్వాత ఏపీని తాకుతూ తెలంగాణలోని మక్తల్‌ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. రాహుల్ పాదయాత్ర తెలంగాణ-కర్నాటక సరిహద్దు గ్రామాల గుండానే సాగుతూ.. మహారాష్ట్రలో ఎంటర్ అవుతుంది. అసలు తెలంగాణలో కీలకమైన ప్రాంతాలను ఈ పాదయాత్రలో అసలు టచ్ కూడా చేయడం లేదు. మరో ఏడాదిలో తెలంగాణలో సార్వ‌త్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటే బాగుంటుందని టీపీసీసీ రేవంత్ అంటున్నారు. ఇప్పటి రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ గాంధీ పాదయాత్ర సాగితే.. అసలు ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఆయన వాదిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలోని హెచ్ఎండీఏ ప్రాంతాలను కలుపుతూ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం మీదుగా సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్‌ను కూడా కలుపుకొని పోతే బాగుంటుందని రేవంత్ మార్పులు సూచిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని.. ఇలా మార్పులు చేస్తే 150 రోజుల యాత్ర కాస్తా.. మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందని అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తుంది. అయినా సరే రేవంత్ రెడ్డి తన పట్టును వీడటం లేదు. భారత్ జోడో యాత్రకు తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టకుండా పాదయాత్రలో మార్పులు చేయాల్సిందేనని రేవంత్ చెబుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా మద్దతు పలికినట్లు తెలుస్తుంది.

తెలంగాణకు సంబంధించిన రూట్ మ్యాప్‌లో మార్పులు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు రేవంత్‌తో కలసి సమావేశం కానున్నారు. అందరూ ఒక అభిప్రాయానికి వస్తే.. ఆ ప్లాన్‌ను అధిష్టానానికి చెప్పాలని భావిస్తున్నారు. నాయకులందరూ ఒకే మాట మీద ఉంటే హైకమాండ్ కూడా అభ్యంతరం చెప్పదని రేవంత్ అనుకుంటున్నారు. ఒకవేళ తెలంగాణ యాత్రలో మార్పులు చేస్తే.. దానికి అనుగుణంగా ఇతర రాష్ట్రాల రూట్‌లో కూడా మార్పులు వస్తాయి. అందుకు అక్కడి నేతలు ఒప్పుకుంటారా అనేది అనుమానంగా మారింది. తెలంగాణలో రాహుల్ వరంగల్ సభ విజయవంతం అయ్యిందని.. ఇక ఈ పాదయాత్ర ఇటువైపు నుంచి సాగితే మంచి ఫలితం వస్తుందని రాష్ట్ర నాయకులు రాహుల్‌కు చెప్తున్నట్లు సమాచారం. మరి రేవంత్ ఆశలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  29 Aug 2022 1:05 PM IST
Next Story