Telugu Global
National

జూన్-2 నుంచి పెరగబోతున్న టోల్ బాదుడు

జూన్ 1న ఏడో విడత ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో జూన్-2 నుంచి ఎన్‌హెచ్ఏఐ వడ్డింపు మొదలు పెట్టబోతోంది.

జూన్-2 నుంచి పెరగబోతున్న టోల్ బాదుడు
X

సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడిన టోల్ చార్జీల పెంపు జూన్-2 నుంచి అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తులు పూర్తయ్యాయి. జూన్-1 న చివరి విడత పోలింగ్ పూర్తయిన తర్వాత, అదే రోజు అర్థరాత్రి నుంచి టోల్ ధరలు పెరుగుతాయి. వాస్తవానికి ఏప్రిల్-1 నుంచి టోల్ చార్జీలు పెరగాల్సి ఉండగా.. ఎన్నికల కారణంగా 2 నెలలపాటు వాహనదారులకు ఊరట లభించిన సంగతి తెలిసిందే.

ప్రతి ఏడాది ఏప్రిల్-1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమలులోకి వస్తాయి. ఈ సారి కూడా ధరలు పెంచిన జాతీయ రహదారుల సంస్థ వాటిని అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఎన్నికల కారణంగా పెంచిన చార్జీలు వాయిదా వేయాలని, ఆమేరకు ఎన్‌హెచ్ఏఐకి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్‌హెచ్ఏఐ రెండు నెలలు మినహాయింపునిచ్చింది. ఏడు విడతలు ఎన్నికలు పూర్తయ్యే ఆగుతామని చెప్పింది.

జూన్ 1తో ఏడో విడత ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో ఎన్‌హెచ్ఏఐ వడ్డింపుకి సిద్ధమైంది. పెంచిన చార్జీలు ఎంతమేర ఉంటాయనేది తేలాల్సి ఉంది. సహజంగా 5 శాతం టోల్ చార్జీలు ప్రతి ఏడాదీ పెరుగుతాయి. ఈసారి కూడా అదే మేర ఉంటుంది. అయితే 2 నెలల నష్టాన్ని ఎన్‌హెచ్ఏఐ కవర్ చేసుకోవాలనుకుంటుందో లేదో చూడాలి.

First Published:  22 May 2024 7:17 AM IST
Next Story