టోల్ ఛార్జీలు పెరిగాయి.. ఇవాల్టి నుంచే అమల్లోకి!
రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటిన టోల్ ఛార్జీలు పెంచాల్సి ఉండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెంపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక చివరి విడత పోలింగ్ శనివారం ముగియడంతో టోల్ ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా - అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి.
ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ రూ.5 పెరగనుండగా.. తేలికపాటి వాణిజ్య వాహనాలకు రూ.10 అదనంగా వసూలు చేయనున్నారు. బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి అదనంగా 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి అదనంగా 35 రూపాయలు వసూలు చేయనున్నారు. భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, రెండు వైపులా కలిసి రూ.50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. ఇక స్థానికుల మంత్లీ పాస్ రూ.330 నుంచి 340కి పెరగనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి.