Telugu Global
National

బీఆర్ఎస్@నాందేడ్: అదిరిపోతున్న ఏర్పాట్లు, భారీగా చేరికలు

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్‌ నాందేడ్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గురుద్వారా సచ్ ఖండ్ మైదాన్ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు.

బీఆర్ఎస్@నాందేడ్: అదిరిపోతున్న ఏర్పాట్లు, భారీగా చేరికలు
X

మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈరోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంలో తొలి సభ సూపర్ సక్సెస్ అయిన తర్వాత పొరుగు రాష్ట్రంలో తొలిసారిగా బీఆర్ఎస్ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతమంతా గులాబిమయం అయిపోయింది. భారీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వస్తారు.


కేసీఆర్ షెడ్యూల్ ఇలా..

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్‌ నాందేడ్ బయలుదేరుతారు. 12.30 గంటకు నాందేడ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గురుద్వారా సచ్ ఖండ్ మైదాన్ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు.

భారీగా చేరికలు..

నాందేడ్ సభలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీసభ్యులు, మాజీ సర్పంచ్ లు.. ఇలా మొత్తం 60 మంది నేతలు బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. వారందరికీ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానిస్తారు. చేరికల తరువాత 4గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం ఆయన తిరిగి హైదారాబాద్ కు చేరుకుంటారు.

గులాబిమయం..

బీఆర్‌ఎస్‌ సభ కోసం నాందేడ్ పట్టణంలోని రోడ్లన్నీ బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, కేసీఆర్ హోర్డింగ్‌ లు, బ్యానర్లతో గులాబీమయంగా మారాయి. సభ ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్‌.. తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

First Published:  5 Feb 2023 5:15 AM IST
Next Story