హర్ ఘర్ తిరంగా, దళిత సర్పంచ్ లకు మాత్రం జెండాలు ఎగురవేసే హక్కు లేదు!
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ దేశంలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల దళిత సర్పంచ్ లకు జాతీయ జెండా ఎగురవేసే హక్కు కూడా లేకుండా పోతోంది. హిందూ కులాల పెద్దలు తమను జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటున్నారని దళిత సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు.
భారత దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్నా నేటికీ దళితులపై దారుణమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా వారు కనీసం జాతీయ జెండాను కూడా ఆవిష్కరించకూడదన్న స్థాయిలో వివక్ష ఉందంటే దేశ పురోగతి గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు సిగ్గుపడాల్సి ఉంటుంది. తమిళనాడులోని కొన్ని పంచాయితీల్లో దళిత సర్పంచులు ఈ ఆజాదీ కా అమృతోత్సవాల్లో జాతీయ జెండా ఆవిష్కరించ లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ సారే కాదు ఎంతోకాలంగా తమిళనాడు గ్రామ పంచాయితీలలో దళిత సర్పంచ్ లను హిందువులు బహిష్కరించడం, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో జాతీయ జెండాను ఎగురవేయకుండా వారి అధికారాలను ఉపయోగించకుండా నిరోధించే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
సీపీఐ(ఎం)కి చెందిన తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ (టీఎన్‌యూఈఎఫ్) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.రాష్ట్రంలోని12,524 గ్రామ పంచాయతీలలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన 1,600 గ్రామ పంచాయతీలలో 383 లో దళిత సర్పంచ్ ల అధికారాలను ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.
హిందూ కుల సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కళ్లకురిచ్చి జిల్లాలోని ఏడుతవైనాథం పంచాయతీకి చెందిన దళిత మహిళా అధ్యక్షురాలు సుధా వరదరాజీ రాసిన లేఖ నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసే హక్కును ఆమె వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారు.
తన కులం కారణంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జెండా ఎగురవేసేందుకు అనుమతించలేదని ఆమె ఆగస్టు 3న జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
"నా కంటే ముందు, గతంలో 10 మంది పంచాయతీ అధ్యక్షులు ఉన్నారు.వారు అందరిని జెండా ఎగురవేసేందుకు అనుమతించారు. కానీ, నాకు మాత్రం అనుమతి నిరాకరించారు. నేను ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నా హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను, "అని సుధా వరదరాజీ అన్నారు. ఆమె మొదటిసారి అధ్యక్షురాలిగా ఉన్నందున జనవరి 26, 2022న జెండాను ఎగురవేయడానికి అనుమతించలేదు. అయితే వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా జెండా ఎగురవేసేందుకు అనుమతించడం లేదని ఆమె ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున తమ పాఠాశాలలో జెండాఎగరేయడానికి తనను స్కూలు అధికారులు, ఇతర పెద్దలు అనుమతించలేదు. ఎందుకని ప్రశ్నించగా స్వాతంత్య్రదినోత్సవం రోజున సర్పంచ్ జెండా ఎగరేస్తారు ఈ సందర్భంలో కాదని జవాబిచ్చారని రాజి తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టంలేక అప్పుడు మౌనంగా ఉండిపోయాను. ఆగస్టు 15న పతాకావిష్కరణ చేయాలనుకుంటే మీరు కాదు.. ఎమ్మెల్యే వస్తారని తనను దూరం పెట్టారని ఆమె ఆరోపించింది. దీంతో డీఎస్పీకి లేఖ రాసినా, ఎటువంటి ఫలితం లేకపోయింది. ఆఖరికి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఇలాంటి వివక్ష కనిపించడం ఇదే మొదటిసారి కాదని, ఎంతోకాలంనుంచి దళిత పంచాయితీ అధ్యక్షులు వివక్ష,మతోన్మాదాలను ఎదర్కొంటున్నారని యాక్టివిస్టులు చెబుతున్నారు. "అధికారంలో ఎవరు ఉన్నా, దళిత అధ్యక్షులు పదే పదే ఈ విధమైన వివక్షకు గురవుతున్నారు" అని తన్నచ్చి అనే సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్ నందకుమార్ అన్నారు. స్థానిక సంస్థల పాలనపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. దళితులతో పాటు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా అధ్యక్షురాలు కూడా తమ విధులను నిర్వహించకుండా వారి అధికారాలను ఉపయోగించకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు.
"చాలా సందర్భాలలో, కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ సమస్య వెలుగులోకి వస్తుంది. అయినా కూడా ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. కాబట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పక్షపాతం, అసహనం గురించి ప్రభుత్వానికి తెలిసినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు'' అని నందకుమార్ అన్నారు. చాలా చోట్ల జిల్లా పోలీసు అధికారులు లాంఛనంగా ఒకరిద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకుంటున్నారన్నారు. "కానీ, దళిత సర్పంచ్ జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకోవడం వంటి వివక్షాపూరిత చర్యలను అధికారులు ఆపలేకపోతున్నారు" అని నందకుమార్ అన్నారు.