ఇలా కూడా కక్ష సాధిస్తారా..? గుజరాత్ లో టీఎంసీ నేత అరెస్ట్..
తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే, మోర్బీ ఘటనపై గతంలో ఘాటుగా ట్వీట్లు చేశారు. అప్పట్లో సమయం కోసం వేచి చూసిన గుజరాత్ ప్రభుత్వం, తాజాగా సాకేత్.. జైపూర్ వెళ్తుండగా విమానాశ్రయంలోనే అతడిని అరెస్ట్ చేయించడం గమనార్హం.
రాజకీయ కక్ష సాధింపుల విషయంలో బీజేపీ మరీ శృతి మించుతోందనే విమర్శలు వినపడుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడమే కాకుండా, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని కూడా తమ కక్ష సాధింపులకు ఉపయోగించుకుంటోంది కాషాయ పార్టీ. ఇటీవల గుజరాత్ లో మోర్బీ తీగల వంతెన కుప్పకూలిన ఘటన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినవారికి సంకెళ్లు బహుమతిగా ఇవ్వాలని చూస్తోంది బీజేపీ. మోర్బీ దుర్ఘటనపై ట్వీట్ చేసిన టీఎంసీ నేతను తాజాగా గుజరాత్ లో అరెస్ట్ చేయడమే దీనికి నిదర్శనం. అయితే ఆ అరెస్ట్ ని స్థానిక పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
మోర్బీ తీగల వంతెన కుప్పకూలడం వెనక స్థానిక బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ సంస్థ కక్కుర్తి ఉన్నాయి. 150మందికి పైగా చనిపోయిన ఈ దుర్ఘటనపై తూతూ మంత్రంగా విచారణ జరిపి అసలు దోషుల్ని కాపాడాలని చూస్తోంది గుజరాత్ ప్రభుత్వం. అయితే దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని, కాంట్రాక్ట్ సంస్థ అధినేతలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే, మోర్బీ ఘటనపై గతంలో ఘాటుగా ట్వీట్లు చేశారు. అప్పట్లో సమయం కోసం వేచి చూసిన గుజరాత్ ప్రభుత్వం, తాజాగా సాకేత్ జైపూర్ వెళ్తుండగా.. విమానాశ్రయంలోనే అతడిని అరెస్ట్ చేయించడం గమనార్హం.
సాకేత్ అరెస్ట్ ని టీఎంసీ తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. తెల్లవారు ఝామున 2గంటలకు సాకేత్ నుంచి అతని తల్లికి ఫోన్ వచ్చిందని, అతను అహ్మదాబాద్ వెళ్తున్నట్టు చెప్పాడని, ఆ తర్వాత అతడి ఫోన్ పనిచేయలేదని, రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, సెల్ ఫోన్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు టీఎంసీ నేతలు. సాకేత్ పై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు టీఎంసీ నోరు మూయించలేవని ఘాటుగా బదులిచ్చారు. అయితే సాకేత్ అరెస్ట్ పై జైపూర్ పోలీసులు తమకెలాంటి సమాచారం లేదన చెప్పడం విశేషం.