‘ఇండియా’ కూటమికి షాకిచ్చిన ‘ఆప్’.. - ఏకపక్షంగా ఎంపీ అభ్యర్థుల వెల్లడి
ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలి జాబితాను ప్రకటించింది.
‘ఇండియా’ కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఊహించని షాకిచ్చింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ ఎంపీ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించింది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న ఆ పార్టీ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నందున కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తాము ఇండియా కూటమితోనే ఉన్నామని ఆయన తెలిపారు.
ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలి జాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది.
ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.