Taraka Ratna: తారకరత్న ఉన్న ఆస్పత్రి వద్ద అదనపు బలగాలు..
Taraka Ratna: నిమ్హాన్స్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ వద్ద అభిమానుల తాకిడి రోజు రోజుకీ పెరుగుతోంది. తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతోందనే వార్తలేవీ బయటకు రాకపోవడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రి వద్దకు వస్తుండటంతో పోలీసులు సందర్శకుల్ని లోపలికి అనుమతించే విషయంలో కఠినంగా ఉంటున్నారు. మరోవైపు అభిమానులను, సందర్శకుల్ని అదుపు చేసేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఆస్పత్రి చుట్టూ పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
పరీక్షల తర్వాతే నిర్థారణ..
తారకరత్న ఆరోగ్యం స్థిరంగా ఉందని, అయితే మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఆయన ఆరోగ్యంపై పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ చేసిన అనంతరం తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. ఈరోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అకాశముంది.
ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి ఆధ్వర్యంలో..
కుప్పంలోని ఆస్పత్రిలో తారకరత్నకు యాంజియోప్లాస్టీ చేశారని అంటున్నారు. అనంతరం బెంగళూరుకి ఆయన్ను తరలించారు. బెంగళూరులో వైద్య బృందం నిరంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తోంది. నిమ్హాన్స్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్‌ల నుంచి 10 మంది వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తారకరత్న గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని అంటున్నారు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని చెప్పారు. ఏదేమైనా ఆస్పత్రి వైద్యుల హెల్త్ బులిటెన్ తో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మరింత క్లారిటీ వస్తుంది.