Telugu Global
National

సిల్వర్ స్క్రీన్ మీద ఈ ఖాన్ త్రయానికి ఎదురేలేదు

57 ఏళ్ళ పడిలో పడుతున్న హీరోలు ఆమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్ ను మకుటం లేని మహారాజుల్లా ఏలుతున్నారు. అయితే మతోన్మాదం రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో ఇండియాలో ఆమిర్, షారుఖ్, సల్మాన్ తమను తాము ఓ అగ్ర స్థానానికి నిలబెట్టుకునేందుకు స్ట్రగుల్ చేయాల్సిందే.. అయితే ఇందులో వాళ్ళు సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సుంది.

సిల్వర్ స్క్రీన్ మీద ఈ ఖాన్ త్రయానికి ఎదురేలేదు
X

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ.. మువ్వన్నెల జాతీయ పతాకం ఎగిరి 75 వసంతాలు అయిన‌ వేళ.. ఈ 'వయస్సు' సాధారణమైనది కాదు.. 75 సంవత్సరాలు.. ఇదో హుందాతనం మూర్తీభవించిన మనిషికి గల వయస్సు.. అనేక అనుభవాల కలబోతకిది ప్రతీకగా నిలిచే వయస్సు.. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో స్థిరంగా ఉండాలని నిర్దేశించే పరిపూర్ణతకు అద్దం పట్టేది ఇదే.. ఈ వయస్సులో ఒకరి నుంచి ట్రిక్కులు, ఎత్తుగడలు నేర్చుకోవలసిన అవసరం లేదు. నేరుగా, విచక్షణ, నైపుణ్యతతో స్వయంగా నిర్ణయాలు తీసుకోవలసిన ఏజ్ కూడా ఇదే.. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసివస్తోందంటే.. ఈ ఏడాదికి ముగ్గురు బాలీవుడ్ నటులు 57 ఏళ్ళ పడిలో పడుతున్నారు. వీళ్ళే వెండితెరను మకుటం లేని మహారాజుల్లా ఏలుతున్న సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ . తమ వయస్సును కూడా లెక్క చేయకుండా ఈ త్రయం ఇన్నేళ్ళుగా నటనకు పరిపూర్ణతను ఆపాదిస్తూ ..తమదైన స్టయిల్ తో యంగ్ ఏజర్లకు ఈర్ష్య పుట్టిస్తున్నారు. మార్చి నెలలో ఆమిర్ 57 వ వసంతంలోకి అడుగు పెట్టగా .. నవంబరులో షారుఖ్, డిసెంబరులో సల్మాన్ ఖాన్ ఈ వయస్సువాళ్లవుతున్నారు. 57 ఏళ్ళు.. ఇదో విశిష్టమైన వయస్సు..' సూర్యవంశం' మూవీ నాటికి అమితాబ్ బచ్చన్ కి 57 సంవత్సరాలు..

ఆమిర్, షారుఖ్, సల్మాన్.. హిందీ సినీ రంగానికి రారాజులే .. . వీళ్ల సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వద్ద చాంతాడంత క్యూలు చూసాం.. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఆడిన వీరి సినిమాలకు ఉన్న.. ఉంటూ వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఏది పడితే అది కాకుండా తమ మనస్సుకు నచ్చిన మంచి స్క్రిప్టులను ఎంచుకుని.. 'హీరోదాత్తమైన' మూవీల్లో వీళ్ళు నటించాలన్న ఆడియెన్స్ ఆశ అత్యాశేమీ కాదు. మూడు దశాబ్దాలుగా తమ సొంత ఈజ్, లెగెసీ, టాలెంటే తమ 'కవచాలు'గా హిందీ సినీ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు చేదు గుళికల్లా ఈ త్రయం కెరీర్లలో వచ్చే అస్థిరత అన్నది వర్రీ కలిగించేదే.. తమ రెమ్యునరేష్ ని, తమకున్న డిమాండును సల్మాన్, షారుఖ్, ఆమిర్ ఎప్పటికప్పుడు సమర్థించుకోవచ్చు. అందుకు వీళ్ళు పూర్తి అర్హులు కూడా.. అయితే కొన్ని సందర్భాలు వీరికి సైతం కంట్లో నలుసులా మారడమే.. తనపై ఉన్న కేసులతో సల్మాన్ తరచూ ఆందోళనకు గురవుతుంటాడు. ఇతనితో బాటు ఆమిర్, షారుఖ్ ల మీద కూడా అప్పుడప్పుడు ట్రోలర్లు విరుచుకుపడుతుంటారు. కానీ ఇందుకు ఈ త్రయాన్ని తప్పు పట్టలేం. ఒక నిర్మాత మేనల్లుడు, ఓ సినీ రచయిత కొడుకు, హిందీ చిత్ర రంగాన్ని ఆక్రమించుకోజూస్తున్న మరో బయటి వ్యక్తి బాలీవుడ్ లో కాలు మోపిన వేళ.. దాన్ని పట్టించుకోకుండా ఆమిర్, సల్మాన్, షారుఖ్.. అచంచల విశ్వాసంతో వెండితెరను తమ సామ్రాజ్యంగా మలచుకుని ఏలుతున్నారంటే అందుకు వీరిలోని సిన్సియారిటీ, వీరి డిసిప్లిన్ కారణమంటే అతిశయోక్తి కాదు.. సమ కాలీనతరుణంలో ఇతర హీరోల మాదిరి కాక .. తమదైన స్టయిల్ తో ఆడియన్స్ ని, తమ ఫాన్స్ ని మెస్మరైజ్ చేయడమే వీరి ప్రత్యేకత,.

'ఖయామత్ సే ఖయామత్' చిత్రం లోను, 'దిల్' లోను ఆమిర్ ఖాన్ వాహ్ అనిపిస్తే . 'మైనే ప్యార్ కియా' లో సల్మాన్, 'బాఘీ'లో షారుఖ్ ఖాన్ మెరిపించిన మెరుపులు ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. వీటిలో 'ఖయామత్ సే ..' ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమైనా దీని ఆదరణ అదుర్స్ ! అలాగే నెట్ ఫ్లిక్స్ లో 'దిల్', అమెజాన్ ప్రైమ్ లో ' మైనే ప్యార్ కియా', 'ఫాజీ' , 'సర్కస్' మూవీలకు రెస్పాన్స్ అపారం. 'దీవానా', 'రాజు బన్ గయా జెంటిల్మెన్' చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో ఆడుతున్నాయి. ఈ సినిమాలకు గాను ఆడియెన్స్ నుంచి అందుతున్న ఫిదాను ఈ ముగ్గురు 'బాయ్ లూ ' ఏ మాత్రం ఊహించలేదు. వీళ్ళ ఎనర్జీలో తటిల్లతలు మెరుస్తున్నాయి మరి ! యాక్టింగ్ లో వీళ్ళు ఎవరికి వాళ్ళేసాటి . హెవీ రోల్స్ అయినా, చిలిపి పాత్రలైనా, విలన్లను మట్టి కరిపించేవైనా, ప్రేమ, ఉదాత్తతను చాటేవైనా.. ఈ త్రయానికి సాటి వచ్చేవారేలేరు. మరి వీళ్లకు కోట్లాది ఫాన్స్ ఉన్నారంటే ఉండరూ మరి ? ఆమిర్ 'గజినీ' సినిమా సక్సెస్ తో సల్మాన్ .. దక్షిణాది చిత్రాల రీమేక్ మీద దృష్టి పెట్టాడు.

సిల్వర్ స్క్రీన్ మీద యూసుఫ్ ఖాన్ 'దిలీప్ కుమార్' అయితే .. సంగీత ప్రపంచంలో దిలీప్ కుమార్.. 'ఏఆ. ఆర్. రెహమాన్' అయ్యారు. వీళ్లిద్దరి భార్యల పేర్లు కూడా సైరాబానే.. మతానికి ఈ సినీ ప్రపంచానికి సంబంధం లేదు మరి.. క్రికెట్ లో మనం కపిల్ దేవ్ ని ఎంతగా అభిమానిస్తామో.. ఇమ్రాన్ ఖాన్ మీదకూడా అంతే ఆదరణ చూపుతాం.. ఈ 75 ఏళ్ళల్లో ఈ దేశంలో అభద్రతాభావాలు పెరిగిపోతున్నాయి. మతకారణాలను చూపి సినిమాలను బహిష్కరిస్తున్నారు. ఓ చిత్రంలో 'హిందుత్వ'ను విలన్ క్యారెక్టర్ గా చూపితే దాన్ని బాయ్ కాట్ చేస్తున్నాం. ఏమైనా.. 'ముప్పు' ముంగిట్లో ఉన్న ఇండియాలో ఆమిర్, షారుఖ్, సల్మాన్ తమను తాము ఓ అగ్ర స్థానానికి నిలబెట్టుకునేందుకు స్ట్రగుల్ చేయాల్సిందే.. అయితే ఇందులో వాళ్ళు సక్సెస్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సుంది. ఇందుకు కారణం.. 1990 నాటికీ, నేటికీ ఈ ముగ్గురూ హీరోలుగానే సిల్వర్ స్క్రీన్ ని ఏలుతుండడమే.. ఈ 'ముర్కీ' చరిత్రలో వీరి స్థానం ఎప్పటికీ పదిలమే.. !



First Published:  14 Aug 2022 3:20 PM IST
Next Story