భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ హిందువులేనట: కేరళ గవర్నర్ ఉవాచ
“హిందూ అనేది మతపరమైన పదమని నేను భావించడం లేదని, అది భౌగోళిక పదమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకసారి చెప్పారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశంలో పండిన ఆహారాన్ని తింటారు. భారతీయ నదుల నీటిని తాగితారు. వారందరినీ హిందువులుగా పిలవాలి ”అని ఆయన అన్నారు.
హిందు మతం కాదని అదో ధర్మమనే ప్రచారం విన్నాం కదా ఇప్పుడు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరో సిద్దాంతం వినిపించారు. ‘హిందూ’ అనే పదం భౌగోళిక పదమని, భారత్‌లో పుట్టి, దేశంలో తింటూ, తాగేవారిని ‘హిందూ’ అని పిలవాలని మహ్మద్ ఖాన్ అన్నారు.
ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు తిరువనంతపురంలో శనివారం నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ను ప్రారంభిస్తూ కేరళ గవర్నర్ ఈ వ్యాఖ్య చేశారు.
“హిందూ అనేది మతపరమైన పదమని నేను భావించడం లేదని, అది భౌగోళిక పదమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకసారి చెప్పారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశంలో పండిన ఆహారాన్ని తింటారు. భారతీయ నదుల నీటిని తాగితారు. వారందరినీ హిందువులుగా పిలవాలి ”అని ఆయన అన్నారు.
"మీరు నన్ను హిందువు అని పిలవాలి... వలసరాజ్యాల కాలంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదాలను ఉపయోగించడం అప్పటి అవసరం. ఎందుకంటే పౌరుల సాధారణ హక్కులను నిర్ణయించడానికి బ్రిటీషర్లు కమ్యూనిటీలను ప్రాతిపదికగా చేసుకున్నారు," అని అతను చెప్పాడు.
ఈయన ఇంతకుముందు గోద్రా అల్లర్ల పై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని దుయ్యబట్టారు. భారతదేశాన్ని వంద ముక్కలుగా చూడాలనుకునే వారు, ఈ దేశ ఐక్యతను చూసి కలత చెందుతున్నారని, అందుకే వారు ఇలాంటి ప్రతికూల ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు.
“భారతదేశం చీకటిలో మగ్గుతుందని కలలు కన్న వారు, భారతదేశం వందల ముక్కలవుతుందని చెప్పినవారు కలత చెందుతున్నారు. అందుకే ఇలాంటి ప్రతికూల ప్రచారాలు జరుగుతున్నాయి. అందుకే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి డాక్యుమెంటరీలు తీస్తూ రకరకాల ప్రచారంలో మునిగితేలుతున్నారు. బ్రిటిష్ వారు భారత్‌కు వచ్చిన నాటి డాక్యుమెంటరీని ఎందుకు తీయరు’’ అని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ప్రశ్నించారు.
“నేడు బహుళజాతి కంపెనీలకు భారతీయ మూలాలున్న వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచం భారతదేశ సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. మనం శక్తివంతులమైతే మనల్ని ఎవరూ ఎదిరించలేరన్న విషయం మన చరిత్రను బట్టి ప్రపంచానికి తెలుసు. మేము మా శక్తులను ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఎన్నడూ ఉపయోగించలేదు. ”అన్నారాయన.