Telugu Global
National

బీజేపీ హయాంలో మాజీ సైనికుల దీన స్థితి ఇది..

అగ్నిపథ్ ద్వారా ముందుగానే సర్వీసు నుంచి బయటకు వచ్చేసేవారికి మాజీ సైనికోద్యోగులు అనే అర్హత ఉండదు, నెలవారీ పింఛన్, ఇతర సౌకర్యాలు కూడా ఉండవు.

బీజేపీ హయాంలో మాజీ సైనికుల దీన స్థితి ఇది..
X

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత పింఛన్ తో పాటు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద రిజర్వేషన్ పొందే అవకాశముంటుంది. అయితే ఈ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు పొందుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది గణనీయంగా తగ్గిపోతుండటం గమనార్హం. 2015లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగాలు పొందినవారి సంఖ్య 10,982 కాగా, 2021 నాటికి ఆ సంఖ్య 2,983కి తగ్గింది.

బీజేపీ హయాంలో ఉద్యోగాలేవి..?

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుల్లో పోస్ట్ ల భర్తీ దారుణంగా పడిపోయింది. దాని ఫలితంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగాలు పొందేవారి సంఖ్య కూడా తగ్గింది. 2015లో ఉద్యోగాల్లో చేరిన మాజీ సైనికోద్యోగుల సంఖ్య 10,982 కాగా, 2016లో ఆ సంఖ్య 9,086కి తగ్గింది. 2017లో 5,638 మంది, 2018లో 4,175 మంది, 2019లో 2,968 మంది, 2020లో 2,584 మంది, 2021లో 2,983 మంది మాత్రమే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగాల్లో చేరారు. ఈమేరకు లోక్ సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఇప్పుడు పూర్తిగా మంగళం..

అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇప్పుడిక ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది మరీ నామమాత్రంగా తయారవుతుంది. అగ్నిపథ్ ద్వారా ముందుగానే సర్వీసు నుంచి బయటకు వచ్చేసేవారికి మాజీ సైనికోద్యోగులు అనే అర్హత ఉండదు, నెలవారీ పింఛన్, ఇతర సౌకర్యాలు కూడా ఉండవు. సైనికులతో కలసి పండగలు జరుపుకోవడం, వారితో కలిపి స్వీట్లు తినడం, సరిహద్దుల్లోకి వెళ్లి సైనిక దుస్తులు వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వడం, ప్రచారం చేసుకోవడంలో ముందున్న ప్రధాని మోదీ.. వారి సౌకర్యాల విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయని విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.

First Published:  23 July 2022 2:33 PM IST
Next Story