మోడీ 'ఉచితాల' వ్యాఖ్యల అసలు టార్గెట్ ఇదా !
రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకొని మోడీ ఉచితాలు మంచివికావన్న వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడా వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ లో పేదల కడుపు కొట్టబోతున్నాయి.
కరోనా కష్ట కాలంలో టీకాలు వేయించడంలో మోదీ సర్కారు ఎంతగా తడబడ్డప్పటికీ, కూడు, కూలీ దొరకక కాలినడకన ఇంటి బాట పట్టిన వలస కార్మికుల గోడు వినిపించుకోనప్పటికీ దేశంలోని పేదలకు అయిదు కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేయడం గొప్ప విషయమే. అయిదు రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో గత ఫిబ్రవరి మార్చ్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్నందువల్ల ఉచిత ఆహార ధాన్యాల సరఫరాను మరికొంత కాలం పొడిగించడం కచ్చితంగా పేదల కడుపు నింపడానికి కొంతైనా ఉపయోగపడింది.
ఆయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి. ఆయన నోటి వెంట ఏ మాటైనా వెలువడితే దాని ప్రభావం ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా కనిపించి తీరుతుంది. పైగా ఆయన మాటల గురి ఒక వైపు లక్ష్యం మరో వైపూ ఉండొచ్చు. ఇటీవల ఆయన రేవడీలు (ఉచితాలు, తాయిలాలు) ఎంత అపకారం చేస్తాయో చెప్పారు. ఆయన ఈ మాట అన్న రాజకీయ సందర్భాన్ని బట్టి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాలలో కాలు మోపడానికి ప్రయత్నిస్తున్న దిల్లీ ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాల మీద దాడి చేస్తున్నట్టు కనిపించి ఉండవచ్చు. కానీ ఉచితాలవల్ల అనర్థం అన్న మోదీ మాట ప్రభావం ఈ నెల నుంచి ఉత్తరప్రదేశ్ లోని 15 కోట్ల మంది ప్రజల మీద పడబోతోంది. ఇప్పటి దాకా ఆ రాష్ట్రంలో రేషన్ కార్డులున్న కుటుంబాలకు గోదుమలు, బియ్యం ఉచితంగా దొరికేవి. కరోనా మహమ్మారి కాటేసిన కాలంలో ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసే విధానం అమలులోకి వచ్చింది.
వచ్చే నెల నుంచి ఉత్తరప్రదేశ్ లో అయిదు కిలోల ఆహార ధాన్యాల ఉచితి పంపిణీ ఆగిపోతుంది. ఆగస్టు నుంచి నిలిపి వేయాలని నిర్ణయించారు. ఇక మీద రేషన్ కార్డులున్న వారు కిలో గోదుమలు రెండు రూపాయలు, కిలో బియ్యం మూడు రూపాయలు ఇచ్చి కొనాల్సిందే. బియ్యం, గోదుమల ఉచిత సరఫరా ఆపివేసినా నెలకు ఒక లీటర్ వంట నూనె, కిలో ఉప్పు, కిలో శెనగలు మాత్రం ఉచితంగానే అందిస్తారట. ఉత్తరప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 3 కోట్ల 60 లక్షల మంది. వీరిలో అంత్యోదయ పథకం కిందకు వచ్చే కుటుబాలు దాదాపు మూడు కోట్లు ఉంటాయి. స్థిరమైన ఆదాయం లేని కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇస్తారు. అంటే నిరుపేదలకు ఈ సదుపాయం ఉంటుంది.
అంత్యోదయ పథకం కింద రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు కిలో రెండు రూపాయల చొప్పున 14 కిలోల గోదుమలు, కిలో మూడు రూపాయల చొప్పున 21 కిలోల బియ్యం అందుతాయి. మామూలు రేషన్ కార్డులున్న వారికి కిలో రెండు రూపాయల చొప్పున రెండు కిలోల గోదుమలు, కిలో మూడు రూపాయల చొప్పున మూడు కిలోల బియ్యం అందుతాయి. ఉచిత రేషన్ సరఫరా నిలిపి వేసినందువల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది రోజు కూలీలే. కరోనా కష్ట కాలంలో, ఎన్నికల పుణ్యమా అని ఉచిత రేషన్ అందినందువల్ల చాలా కుటుంబాలు బతుకు వెళ్లదీయడం కొంతైనా సులభం అయింది. కరోనా సమయంలో ఉపాధి కోల్పొయిన వారిలో చాలా మందికి మళ్లీ పని దొరకడమే లేదు. ఇలాంటి వారు ఉచిత రేషన్ ఆగిపోయినందువల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది.
మరో వేపు అతి వృష్టి, అనావృష్టి రెండూ రైతులను కోలుకోలేని దేబ్బ తీశాయి. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తి, మరి కొన్న చోట్ల అనావృష్టివల్ల పంటలు చేతికి అందలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న రైతుల మనుగడ కూడా ఉచిత రేషన్ ఆగిపోతే దుర్లభమే అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టం జరిగింది కనక, కరోనా సమయంలో కోల్పోయిన ఉపాధి అనేక మందికి ఇప్పటికీ మళ్లీ దొరకలేదు కనక ఉచిత ఆహార ధాన్యాల సరఫరా కొనసాగిస్తే సముచితంగా ఉండేది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయోగించిన చిట్కాలు ఎల్ల కాలం కొనసాగవుగదా. మోదీ హాయంలో ఓట్లు రాల్చని ఏ పథకమూ ప్రజా ప్రయోజనం కోసం నిరంతరంగా సాగదు.
ఏ ప్రభుత్వం ఎవరికైనా ఏ సదుపాయమైనా ఉచితంగానో, తక్కువ ధరకో అందిస్తోంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ పథకంవల్ల ఓట్లు రాలాలి. కనీసం తమది జన సంక్షేమానికి కట్టుబడి ఉందన్న భ్రమైనా కల్పించగలగాలి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికలు లేవు. రెండవసారి వరసగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఇక ఓటర్లతో పనేముంటుంది? సంక్షేమ రాజ్యం, ప్రజా సంక్షేమం అన్న మాటలను రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎన్నికలలో ప్రయోజనం పొందడానికే వాడుతుంటాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వాలు ఉచితంగానో, సబ్సిడీ ధరకో తక్కువ ధరకో అందించినా దానివల్ల జనం పరిస్థితి మెరుగు పడడానికి దోహదం చేయాలి. ప్రజలు వాళ్ల సొంతకాళ్ల మీద నిలబడడానికి ఇలాంటి పథకాలు కొంతకాలం ఊతకర్రల్లా మాత్రమే ఉపయోగపడాలి. కానీ ప్రభుత్వాలు రూపొందించే ఏ సంక్షేమ పథకమైనా రాజకీయ లబ్ధి లక్ష్యంగానే ఉంటుంది తప్ప అసలైన జనాభ్యుదయానికి లేశమంత కూడా ఉపకరించదు. ప్రజల పరిస్థితి మారనంత కాలం ఉచితాల కోసం నోరు తెరుచుకుని ఎదురు చూడడమూ ఆగదు.
ఇలాంటి పథకాల ఆధారంగా స్వావలంబన సాధించామన్న భరోసా గత ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూ కలగనేలేదు. ప్రజల ఆర్హిక స్థితి మారకపోగా ఆత్మాభిమానం కూడగట్టుకునే అవకాశమే రాలేదు. దీన్నిబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రూపొందించడంలోనే మౌలికమైన లోపం ఉందనిపిస్తోంది. ఊతకర్రల అవసరం శాశ్వతంగా ప్రజలకు ఉండకూడదు. కానీ అవి అనవసరం లేని రూపంలో ప్రభుత్వాలు వాటిని తయారు చేయవు. ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి బతికే అవసరం ఉన్నన్నాళ్లే తమ వాగ్దానాలకు చెలామణి ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కోసం దశాబ్దాల తరబడి ప్రభుత్వ ఖజానా నుంచి పెడ్తున్న ఖర్చు తాత్కాలిక ఉపశమనానికే పనికి వస్తోంది. ఆ సహాయం అవసరమైన వారు నిలదొక్కుకోవడానికి, ఆ తరవాత స్వయం శక్తి మీద నిలబడడానికి ఏ మాత్రం ఉపకరించడం లేదు. జన జీవనం మెరుగుపడాలన్న భావన ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఉచితాలు ఓట్లు లాగడానికి ఎరగా వాడుకోవడం మినహా మరో లక్ష్యం లేనంత కాలం సంక్షేమం అసాధ్యమే.