ఇది క్రమశిక్షణా రాహిత్యం..' గెహ్లాట్ తీరు పై అధిష్టానం అసహనం !
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరించడం, పార్టీకే షరతులు విధించడం వంటి చర్యలను అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలకు నచ్చజెప్పడంలో నిస్సహాయత వ్యక్తం చేసి చేతులు దులుపుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరించడం, పార్టీకే షరతులు విధించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. పైగా పరిశీలకులు సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి సమాంతరంగా ఎమ్మెల్యేలు వేరుగా సమావేశం కావడం, సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిగా అంగీకరించేది లేదంటూ తీర్మానం చేయడమేంటని అధిష్టానం ప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ఈ పరిణామాలపై పార్టీ ఇన్ ఛార్జి అజయ్ మాకెన్ స్పందిస్తూ, "వారి వ్యవహార శైలి క్రమశిక్షణా రాహిత్యంగా ఉంది. ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం " అని అన్నారు.
కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు-ప్రతాప్ ఖచార్యవాస్, ఎస్. ధరివాల్, సీపీ. జోషి లు మూడు డిమాండ్లను ముందుకు తెచ్చారు. " రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించే బాధ్యత ను అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పజెప్పాలంటూ తీర్మానించాలన్నది ఒక డిమాండ్ . గెహ్లాట్ శిబిరంలోని 102 మంది శాసనసభ్యుల నుంచి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని షరతు కూడా పెట్టారు. " అని మాకెన్ అన్నారు,
"కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ ఎలాంటి తీర్మానం చేయలేదని, ఇటువంటి షరతులతో కుదరదని కూడా మేము చెప్పాము" అని మాకెన్ అన్నారు. అంతేగాక, ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరితో ముఖాముఖి మాట్లాడుతామంటే వారేమో గ్రూపులుగా వస్తామని పట్టుబట్టారని మాకెన్ తెలిపారు.
కాగా ఈ తగాదా రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరింది. సంక్షోభం ముదరుతుండడంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను మధ్యవర్తిగా పంపాలని అధిష్టానం భావిస్తోంది. ఆయన్ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. పార్టీ పరిశీలకులు ఖర్గే, మాకెన్ తో పాటు సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, కమల్ నాథ్ లు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం కానున్నారు. ఇదే సందర్భంలో గెహ్లాట్, పైలట్ వర్గాలను కూడా ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ మంగళవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ను (గెహ్లాట్‌ను) పార్టీ చీఫ్ రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు సమాచారం.
ఈ వివాదం మరింత ముదిరితే ప్రభుత్వ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ 108 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో సచిన్ పైలట్ కు దాదాపు 10-15 మంది మద్దతు పలికేవారు ఉన్నారు. ఇక గెహ్లాట్ వర్గంలో 90 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ పరిణామాలపై బిజెపి గేలి చేయడం ప్రారంభించింది. సమీకరణలు ఏ మాత్రం తేడా వచ్చినా బిజెపి కాచుకుని కూర్చుంది. ఈ తరుణంలో అధిష్ఠానం ఈ పరిణామాలను సీరియస్ గా పరిగణిస్తోంది.
డిసెంబరు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి పదవిపై గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పైలట్‌ను డిప్యూటీగా నియమించగా, హైకమాండ్ గెహ్లాట్‌ను మూడవసారి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. జూలై 2020లో, పైలట్‌తో పాటు 18 మంది పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లాట్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ ఆయనకు పదవి రాకుండా గెహ్లాట్ వర్గం ప్రయత్నిస్తోంది.