ఇది చారిత్రాత్మక విజయం.. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే
మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని సీఎం ఏక్‌నాథ్ శిందే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు స్వీట్ తినిపించుకున్నారు. శిందే మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని తెలిపారు. ఓటర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అంటే ఫేస్‌బుక్ కాదని ఉద్దవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ప్రజల మధ్యే ఉండి పని చేయాలని బాలాసాహెబ్ ఎప్పుడూ చెప్పేవారని.. ఆయన సూచనలను తమకు ఎప్పటికీ అనుసరిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మహావికాస్ అఘాడీ కూటమి సృష్టించిన అనేక అడ్డంకులు, అవాంతరాలను తాము అధిగమించామన్నారు. కోస్టల్ రోడ్, అటల్ సేతు, ముంబయి మెట్రో లాంటి ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటూ ఫేక్ ప్రచారం చేసి కొంత వరకు లబ్ధి పొందారని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి వాళ్లది తప్పుడు ప్రచారం అని తేలిపోయిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మహాయుతి కూటమి విజయంలో లక్కీ బహిన్ పథకం గేమ్ ఛేంజర్ అని ఎన్‌సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ అన్నారు. ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోలేని వాళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బ్యాలెట్ ఓటింగ్ అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈవీఎంలలో లోపం ఉంటే తాము జార్ఖండ్ లో ఓడిపోయాం కదా దానికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మహారాష్ట్ర ప్రజలు మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే కూటమికి అపూర్వ విజయాన్ని అందించారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.