బీహార్‌లో వింత ఘటన.. ఏకంగా సెల్ టవర్ చోరీ
చోరీకి గురైన సెల్ టవర్ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదే పాట్నాలో 2022 నవంబరులోనూ రూ.19 లక్షల విలువైన సెల్ టవర్ చోరీకి గురవడం గమనార్హం.
బీహార్‌లో దొంగలు ఎవరూ ఊహించని విధంగా చోరీలకు పాల్పడుతూ వాటి యజమానులను, పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నారు. ఇంతకుముందు రైలింజన్, ఇనుప వంతెన వంటి భారీ పరిమాణంలోని వస్తువులను దొంగతనం చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సెల్ టవర్‌పై కన్నేసిన దొంగలు ఏకంగా టవర్‌నే దర్జాగా ఎత్తుకుపోయారు.
ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన ఈ చోరీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాట్నాలోని సబ్జీబాగ్ ప్రాంతంలో ఓ భవనంపై గుజరాత్ టెలీ లింక్(జీటీఎల్) కంపెనీ ఒక సెల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. నాలుగు నెలల క్రితం కొందరు వ్యక్తులు ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జీటీఎల్ ఉద్యోగులమంటూ పరిచయం చేసుకున్నారు.
టవర్‌కు మరమ్మతులు చేయాలని చెప్పి భవనంపైకి వెళ్లారు. వారు పైకి వెళ్లి నాలుగు గంటలవుతున్నా కిందకి రాకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. పైన చూస్తే టవర్ మాయమైంది. ఒక్కసారిగా కంగుతిన్న ఇంటి యజమాని.. వారు టవర్‌ను విడిభాగాలుగా చేసి ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. వెంటనే దీనిపై జీటీఎల్ మేనేజర్‌కు సమాచారమిచ్చాడు. ఈ వ్యవహారంపై కంపెనీ నాలుగు నెలల పాటు అంతర్గతంగా విచారణ జరిపింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడం, ఆధారాలు కూడా లభ్యం కాకపోవడంతో చేసేది లేక తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోయిన్ సెల్ టవర్ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదే పాట్నాలో 2022 నవంబరులోనూ జీటీఎల్ కంపెనీకే చెందిన రూ.19 లక్షల విలువైన సెల్ టవర్ ఒకటి చోరీకి గురవడం గమనార్హం.