Telugu Global
National

బీహార్ లో రైలింజన్ దొంగతనం..!!

రైలింజన్ చోరీకోసం ఏకంగా సొరంగం తవ్వారు దొంగలు. గర్హార రైల్వే యార్డ్ కు పక్కగా ఈ సొరంగం కనిపించింది. సొరంగం ద్వారా వచ్చిన దొంగలు.. రోజుకో పార్ట్ విడగొట్టి తీసుకునివెళ్లేవారు.

బీహార్ లో రైలింజన్ దొంగతనం..!!
X

సైకిల్ దొంగల్ని చూశాం, బైక్ దొంగల గురించి తెలుసు, కార్లు కూడా చాకచక్యంగా ఎత్తుకెళ్లేవారు ఉన్నారు. బస్సులు, లారీల వంటి పెద్ద వాహనాలను దొంగతనం చేస్తే విడిభాగాల కింద విడగొట్టి అమ్ముకుంటుంటారు. సరిగ్గా అలాగే రైలింజన్ ని కూడా దొంగలెత్తుకెళ్లారు. రైలింజన్ దొంగతనం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం, బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో రైల్వే యార్డ్ లో ఉన్న రైలు డీజిల్ ఇంజిన్ ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈమేరకు బరౌని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

దొంగతనం ఎలా..?

బెగుసరాయ్ జిల్లాలో గర్హార రైల్వే యార్డ్ ఉంది. ఇక్కడికి మరమ్మతులకోసం రైలింజన్లు తీసుకొస్తుంటారు. ఇటీవల ఓ డీజిల్ ఇంజిన్ ని యార్డ్ కి తీసుకొచ్చారు. మరమ్మతులు మొదలు పెట్టేందుకు ఆలస్యం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. తీరా టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతులు చేద్దామని చూసే సరికి రైలింజన్ అక్కడ లేదు. హడావిడి పడ్డ రైల్వే అధికారులు బరౌని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.

ఏకంగా సొరంగం తవ్వేశారు..

రైలింజన్ చోరీకోసం ఏకంగా సొరంగం తవ్వేశారు దొంగలు. గర్హార రైల్వే యార్డ్ కు పక్కగా ఈ సొరంగం కనిపించింది. ఆ సొరంగం ద్వారా వచ్చిన దొంగలు.. రోజుకో పార్ట్ విడగొట్టి తీసుకునివెళ్లేవారు. అలా అన్ని పార్టులను వారు పాత సామాన్లు అమ్మే షాపుకి తరలించారు. పోలీసులు విచారణలో పాత సామాన్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ముజఫర్ పూర్ జిల్లాలోని ఓ షాపులో 13 పెద్ద పెద్ద సంచులు కనపడ్డాయి. వాటిని తీసి చూస్తే రైలింజన్ విడి భాగాలు కనపడ్డాయి. దొంగలు దొరికారు కానీ, ఇదో పెద్ద సంచలనంగా మారింది. రైలింజన్ ని తరలిస్తున్నా రైల్వే అధికారులు ఎందుకు గమనించలేదనే విమర్శలు వినపడుతున్నాయి.

First Published:  26 Nov 2022 8:01 AM IST
Next Story