Telugu Global
National

రాజ్యసభలో అత్యధిక ధనవంతులు వీళ్లే.. అగ్రస్థానంలో తెలుగు ఎంపీలు

రాజ్యసభలో అత్యధిక ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో బీఆర్ఎస్‌కు చెందిన బండి పార్థసారథి రెడ్డి, రెండో స్థానంలో వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉన్నారు.

రాజ్యసభలో అత్యధిక ధనవంతులు వీళ్లే.. అగ్రస్థానంలో తెలుగు ఎంపీలు
X

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధిక ధనవంతులుగా తేలింది. ఏపీలోని 11 మందిలో ఐదుగురు, తెలంగాణలోని ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు తమకు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రాజ్యసభలోని 12 శాతం మంది ఎంపీలు బిలియనీర్లుగా ఉండగా.. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు.

రాజ్యసభలో అత్యధిక ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో బీఆర్ఎస్‌కు చెందిన బండి పార్థసారథి రెడ్డి, రెండో స్థానంలో వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. పార్థసారథి రెడ్డికి రూ.5,300 కోట్లు, అయోధ్య రామిరెడ్డికి రూ.2,577 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో 225 (మొత్తం సీట్లు 233) మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లుగా ఉండగా.. ఇందులో 43.25 శాతం ఆస్తులు వీరిద్దరివే కావడం గమనార్హం. ఇక బీఆర్ఎస్, వైసీపీకి చెందిన 16 మంది ఎంపీల ఆస్తుల వాటా.. మొత్తం ఆస్తుల్లో 86.02 శాతం ఉండటం గమనార్హం. రాజ్యసభలో అత్యధిక ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ రూ.1,001 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు.

రాజ్యసభకు జరిగిన ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లను పరిశీలించిన తర్వాత ఏడీఆర్, న్యూ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. రాజ్యసభలో అత్యధిక మంది సభ్యులు ఉన్న బీజేపీ (85), కాంగ్రెస్ (30) సభ్యుల ఆస్తుల మొత్తం విలువ రూ.4,128 కోట్లుగా ఉండగా.. బీఆర్ఎస్ (7), వైసీపీ (9)ల మొత్తం సభ్యుల ఆస్తి విలువ రూ.9,157 కోట్లుగా ఉన్నది. రాష్ట్రాల వారీగా చూస్తే ఢిల్లీలో ఒకరు, మహారాష్ట్రలో ముగ్గురు, పంజాబ్‌కు చెందిన ఇద్దరు, హర్యానాకు చెందిన ఒకరు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు తమకు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 225 మంది సిట్టింగ్ ఎంపీల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 41 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉండగా.. ఇద్దరు ఎంపీలపై మర్డర్ చార్జెస్ నమోదు అయ్యాయి. ఇక బీజేపీకి చెందిన 85 మంది ఎంపీల్లో 12 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార కేసు నమోదైంది.

First Published:  19 Aug 2023 7:09 AM IST
Next Story