ఈసారి మోడీ వేవ్ లేదు.. - బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
నవనీత్ కౌర్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే పలు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ సర్కారు.. హామీల అమలు విషయంలోనూ జీరోగానే మిగిలింది.
లోక్‌సభ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారిన దశలో బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వేవ్ లేదని ఆమె తేల్చిచెప్పారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవనీత్ కౌర్ రాణా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి సీటు నుంచే స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్.. ఈ మధ్యే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా నవనీత్ కౌర్ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. మోడీ వేవ్ ఉందన్న భ్రమల్లో ఉండొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి తాము గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పోరాడాలని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లందరినీ బూత్ కు తీసుకొచ్చి ఓటు వేయమని చెప్పాల్సి వస్తుందన్నారు. అంతేకాదు.. గతంలో మోడీ పవనాలు వీచినా తాను ఇండిపెండెంట్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి ఎంత కష్టపడాలో తెలిపారు.
నవనీత్ కౌర్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే పలు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ సర్కారు.. హామీల అమలు విషయంలోనూ జీరోగానే మిగిలింది. మరోపక్క రాష్ట్రాల్లో రీజనల్ పార్టీలు మరింత బలోపేతమవుతున్న విషయం తెలిసిందే. దీంతో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వాటి పాత్ర కచ్చితంగా కీలకంగా ఉంటుందని అర్థమవుతోంది.