Telugu Global
National

క్యాంపస్ కొలువులు లేవు.. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ బీ అలర్ట్

గతేడాదితో పోల్చితే సాధారణ నియామకాలు 40శాతం వరకు తగ్గిపోగా.. పెద్ద ప్యాకేజీ వేతనాలు 60శాతం వరకు తగ్గాయని తెలుస్తోంది. కొన్ని సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ప్రకటించడంలేదు.

క్యాంపస్ కొలువులు లేవు.. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ బీ అలర్ట్
X

“ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలోనే ప్రముఖ కంపెనీలో ఆఫర్”

“మా కాలేజీలో వందశాతం క్యాంపస్ ప్లేస్ మెంట్స్..”

“కార్పొరేట్ కంపెనీలతో క్యాంపస్ ఇంటర్యూలు..”

ఇకపై ఇలాంటి మాటలు తక్కువగా వినపడతాయి. ఎందుకంటే క్యాంపస్ కి వచ్చి మెరిట్ స్టూడెంట్స్ ని ఎగరేసుకుపోయే కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ఉన్న ఉద్యోగాలనే ఊడబీకేస్తున్న వేళ, కొత్త ఉద్యోగాల విషయంలో కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. క్యాంపస్ తలుపు తట్టడం మానేశాయి.

మాంద్యం దెబ్బకి పేరుగొప్ప కంపెనీలన్నీ లే ఆఫ్ లతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఐటీరంగం గతంలో ఎప్పుడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 ప్రముఖ కంపెనీలు లే ఆఫ్ లు ప్రకటించగా ప్రపంచ వ్యాప్తంగా 1.10 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ గణాంకాలు ఉద్యోగస్తుల్నే కాదు, ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ ని కూడా భయపెడుతున్నాయి. తాజాగా ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. కరోనా తర్వాత క్యాంపస్ రిక్రూట్ మెంట్ లు భారీగా పెరిగినా, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు 40శాతం కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఆపేశాయి.

గతేడాదితో పోల్చితే సాధారణ నియామకాలు 40శాతం వరకు తగ్గిపోగా.. పెద్ద ప్యాకేజీ వేతనాలు 60శాతం వరకు తగ్గాయని తెలుస్తోంది. కొన్ని సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు ప్రకటించడంలేదు. టీసీఎస్ ఇంటర్వ్యూల తర్వాత కూడా మరికొన్ని టెస్ట్ లు పెడతామంటోంది. విప్రో సంస్థ ఎప్పుడూ నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇన్ఫోసిస్‌ ఫూల్‌ డ్రైవ్‌ నిర్వహించలేదు. చేపట్టిన నియామకాలనే తగ్గించింది. టెక్ మహీంద్ర, క్యాప్‌ జెమిని, మైండ్‌ ట్రీ లాంటి సంస్థలు గతంతో పోల్చితే నియామకాలు బాగా తగ్గించాయి. కాగ్నిజెంట్‌ సంస్థ గతేడాది చేసుకున్న నియామకాల్లో కొన్నింటిని పక్కన పెట్టింది. దీంతో అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్థులు కూడా డైలమాలో పడ్డారు.

క్యాంపస్ కొలువులు రాకపోయినా దిగులు లేదని, బీటెక్ తర్వాత నైపుణ్యాలు పెంచుకోవడంపై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, సేల్స్‌ ఫోర్సులాంటి సంస్థల్లో సర్టిఫికెట్‌ కోర్సులను పూర్తి చేయాలని చెబుతున్నారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో పట్టు సాధించాలంటున్నారు.

First Published:  13 Feb 2023 12:14 AM GMT
Next Story