ఏటీఎం సెంటర్లో దొంగతనం.. ఏం తీసుకెళ్లారో తెలిస్తే నవ్వాగదు
ఈ దొంగలు ఏటీఎం సెంటర్లోకి వెళ్లారు. విజయవంతంగా దొంగతనం చేసుకుని బయటకొచ్చారు. అసలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే నిజంగా షాకవ్వాల్సిందే.
ఏటీఎం సెంటర్లో దొంగతనాలు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ఏటీఎంలో డబ్బులు వేయడానికి లేదా తీయడానికి వచ్చేవారిని టార్గెట్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. నేరుగా ఏటీఎం మెషిన్ పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లాలనుకునేవారు మరో రకం. ఇక మూడో రకం నేరుగా ఏటీఎం బాక్స్ నే తీసుకెళ్లిన ఉదాహరణలున్నాయి. ఇక్కడ మనం చెప్పుకోబోయేది వెరైటీ దొంగల గురించి. ఈ దొంగలు ఏటీఎం సెంటర్లోకి వెళ్లారు. విజయవంతంగా దొంగతనం చేసుకుని బయటకొచ్చారు. అసలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే నిజంగా షాకవ్వాల్సిందే.
ఏటీఎం లోకి అందరూ డబ్బులకోసం వెళ్తారు, కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం ఏసీ కోసం వెళ్లారు. ఏటీఎం సెంటర్లో మెషిన్లు సక్రమంగా పనిచేసేందుకు చల్లటి వాతావరణం అవసరం. అందుకే బ్యాంకు సిబ్బంది ఏసీలను వాడుతుంటారు. మనోళ్ల కళ్లు ఆ ఏసీపై పడ్డాయి. ఎవరూ లేని టైమ్ చూసుకుని ఏటీఎంలోకి వెళ్లి చాకచక్యంగా ఏసీ మెషిన్ ఊడదీసుకుని వెళ్లారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. ఇన్ డోర్ యూనిట్ తీసుకెళ్లారు సరే, మరి ఔట్ డోర్ యూనిట్ సంగతేంటి అనుకుంటున్నారా..? దానికోసం మళ్లీ ప్లాన్ వేస్తారేమో చూడాలి.
పంజాబ్ లోని మోగా జిల్లా భాఘ్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో ఈ చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు లోపలికి వచ్చి ఏసీ ఊడదీసుకుని వెళ్లారు. లోపల ఉన్న డస్ట్ బిన్ తిరగేసి, దానిపైకి ఎక్కి ఏసీ మెషిన్ ఊడదీశారు. సాయంత్రం వేళ ఎవరూ లేని టైమ్ చూసుకుని దొంగతనం చేశారు. ఎంచక్కా బండిపై ఆ ఏసీని తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లో ఈ వ్యవహారం అంతా రికార్డ్ అయింది. ఏసీ దొంగతనం చూసి బ్యాంకు సిబ్బంది షాకయ్యారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.