అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ అమలు చేయాలి... దక్షిణాది రాష్ట్రాల రైతు సమాఖ్య డిమాండ్
కేరళలోని కన్నూర్ జిల్లా చెరుపుజలో రైతు సమాఖ్య రెండు రోజుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ తికాయత్, దక్షిణ భారత రైతు సంఘం అధ్యక్షుడు కె.నరసింహనాయుడు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ, ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని దక్షిణాది రాష్ట్రాల రైతు సమాఖ్య డిమాండ్ చేసింది.
కేరళలోని కన్నూర్ జిల్లా చెరుపుజలో రైతు సమాఖ్య రెండు రోజుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ తికాయత్, దక్షిణ భారత రైతు సంఘం అధ్యక్షుడు కె.నరసింహనాయుడు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా రైతులు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చర్చించారు.
ఈ సందర్భంగా రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతుల అభివృద్ది కోసం అనేక చర్యలు చేపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించారు.
తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, రైతులు తమ తమ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాల అమలు కోసం డిమాండ్ చేస్తూ మెమోరాండం సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కూడా తీర్మానించారు.
ఈ సమావేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
తమ డిమాండ్ల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఫిబ్రవరి 19న చెన్నైలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని రైతులు నిర్ణయించారు.