Telugu Global
National

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా.. తొలగించాలనుకున్నా పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాలకు కాదంటూ 2004 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అధికారం కల్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2004లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.

రిజర్వేషన్ల అంశంలో పంజాబ్‌ ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఎమ్మార్పీఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు.

షెడ్యూల్డ్‌ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా.. తొలగించాలనుకున్నా పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాలకు కాదంటూ 2004 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పంజాబ్‌కు వర్తించదంటూ అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్‌, హరియాణా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే, ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి ఈ వివాదాన్ని బదిలీ చేయాలని 2020లో సిఫార్సు చేసింది. ఇటీవల మళ్లీ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ రాష్ట్రాలకు అధికారం ఉంటుందంటూ తీర్పును వెలువరించింది.

First Published:  1 Aug 2024 12:39 PM IST
Next Story