Telugu Global
National

ఎన్టీఏలో లోటుపాట్లు ఉన్నాయ్‌.. సుప్రీంకోర్టు వెల్లడి

ఎన్టీఏలో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని, ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంది.

ఎన్టీఏలో లోటుపాట్లు ఉన్నాయ్‌.. సుప్రీంకోర్టు వెల్లడి
X

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)లో పలు లోటుపాట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. నీట్‌ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో ఆ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం మరోసారి తీర్పు వెలువరించిన ధర్మాసనం, అందుకు గల కారణాలను వెల్లడించింది. ఈ సందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

నీట్‌ పేపర్‌ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలేమీ చోటుచేసుకోలేదని, పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్‌ జరగలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ లీకేజీ జార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నా వరకే పరిమితమైందని తెలిపింది. దానిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అందుకే తాము పరీక్షను రద్దు చేయాలనుకోలేదని తెలిపింది. అయితే ఎన్టీఏలో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని, ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంది.

ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబరు 30లోగా తమ నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులో అమలు చేయాల్సిన అంశాలపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని, విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది.

First Published:  2 Aug 2024 4:57 PM IST
Next Story