Telugu Global
National

మణిపూర్ ఘటనలపై కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ఈ ఘటనలపై జవాబు కోరుకుంటున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి నింపడానికి న్యాయపరంగా తాము ప్రయత్నిస్తున్నాము. అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నది.

మణిపూర్ ఘటనలపై కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
X

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో వరుసగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ముగ్గురు హైకోర్టు మాజీ జడ్జీలతో కూడిన ఈ కమిటీ.. హింసాత్మక సంఘటనలపై విచారణ జరపడమే కాకుండా బాధితుల పునరావాసం, ఇతర అంశాలపై కూడా అధ్యయనం చేయనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హింస, అల్లర్లపై విచారణకు మాత్రమే పరిమితం కాకుండా.. మరింత విస్తృతమైన అధ్యయనానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది.

మణిపూర్ హింస వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. అక్కడ ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలపై జవాబు కోరుకుంటున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి నింపడానికి న్యాయపరంగా తాము ప్రయత్నిస్తున్నాము. అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నది. ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలిని జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆశ మీనన్ ఉన్నారు.

సీబీఐ విచారణను అన్ని విధాలుగా పర్యవేక్షించడానికి మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ్ పడ్సల్‌గికర్‌ను నియమించింది. అలాగే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పోలీసు అధికారులను సీబీఐలోకి తీసుకోవాలని, వారి ర్యాంక్ కనీసం డిప్యూటీ ఎస్పీ స్థాయి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఐదుగురు అధికారులు సీబీఐ విచారణను అన్ని వైపుల నుంచి పర్యవేక్షిస్తారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.

ప్రస్తుతం మణిపూర్ హింసాత్మక సంఘటనలకు సంబంధించి 42 సిట్‌ బృందాలు విచారణ చేస్తున్నాయి. ఇప్పటికీ ఈ కేసులను సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేయలేదు. ఈ సిట్‌లు అన్నింటినీ మణిపూర్ కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షించాలని సుప్రీం చెప్పింది. ఆరు సిట్‌లకు కలిపి ఒక పర్యవేక్షణ అధికారిని నియమించాలని సూచించింది.

First Published:  7 Aug 2023 4:56 PM IST
Next Story