Telugu Global
National

శ‌ర‌త్‌చంద్రారెడ్డి అరెస్టుకు ముందు, వెనకా?

విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె భ‌ర్త రోహిత్‌రెడ్డికి స్వ‌యానా అన్నే శ‌ర‌త్‌చంద్రారెడ్డి. శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి తండ్రి రాంప్ర‌సాద్‌రెడ్డి అర‌బిందో ఫార్మా వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌గా ఉన్నారు

శ‌ర‌త్‌చంద్రారెడ్డి అరెస్టుకు ముందు, వెనకా?
X

''శరత్ చంద్రారెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బంధుత్వం ఉండటంతో రాజకీయంగా శ‌ర‌త్‌రెడ్డి అరెస్టు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె భ‌ర్త రోహిత్‌రెడ్డికి స్వ‌యానా అన్నే శ‌ర‌త్‌చంద్రారెడ్డి. శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి తండ్రి రాంప్ర‌సాద్‌రెడ్డి అర‌బిందో ఫార్మా వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌గా ఉన్నారు.''

ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించిన త‌రువాత ఈ వ్య‌వ‌హారంపై ఈడీ, సీబీఐలు దృష్టి సారించాయి. ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. లైసెన్సుల కార్టలైజేషన్‌లో శ‌ర‌త్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని, మొత్తం మద్యం లైసెన్సింగ్ ప్రక్రియలో వ‌చ్చిన అవినీతి సొమ్మును తరలించడంలో ప్ర‌ధాన‌ పాత్ర పోషించారని ED వర్గాలు తేల్చాయి.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈ కేసులో శరత్ రెడ్డిని ఈడీ ఇప్ప‌టికే రెండుసార్లు ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతకుముందు ఇండోస్పిరిట్ గ్రూప్‌కి చెందిన సమీర్ మహేంద్రును అరెస్టు చేసింది. ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి సిసోడియా పీఏ అరోరా నివాసంపై కూడా ఈడీ సోదాలు చేసింది. ప‌లు కీల‌క ఆధారాల‌ను సేక‌రించింది.

ఈ కేసులో తొలుత సెప్టెంబ‌ర్ రెండోవారంలో కేర‌ళ‌కు చెందిన ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ (ఓఎంఎల్‌) ఎంట‌ర్‌టైన్ మెంట్ సంస్థ సీఈవో, ఆప్ నేత‌ విజ‌య్ నాయ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 27న అదుపులోకి తీసుకున్న ఈడీ, నాయ‌ర్ ఇచ్చిన స‌మాచారంతో హైద‌రాబాద్‌కు చెందిన అభిషేక్ బోయిన‌ప‌ల్లిని అరెస్టు చేసింది. ప్ర‌స్తుతం అభిషేక్ క‌స్ట‌డీలో ఉన్నారు. అభిషేక్ ఇచ్చిన సమాచారంతో హైద‌రాబాద్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత వ్య‌క్తిగ‌త చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాల‌యంతోపాటు హైద‌రాబాద్‌లో ప‌లుచోట్ల సోదాలు నిర్వ‌హించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. త‌రువాత లిక్క‌ర్ స్కాంలో కీల‌క‌మైన రామ‌చంద్ర‌న్ పిళ్లైను అరెస్టు చేశారు. తాజాగా సిసోడియా పీఏ అరోరాను అదుపులోకి తీసుకొని సీబీఐ ముందు ప్ర‌వేశ‌పెట్ట‌డంతో అరోరా అప్రూవ‌ర్‌గా మారాడు. దీంతో లిక్క‌ర్ స్కాంలో ఊహించని మ‌లుపులు చోటు చేసుకుంటున్నాయి. అరోరా ఇచ్చిన స‌మాచారంతో శ‌ర‌త్ చంద్రారెడ్డి, విన‌య్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవ‌డంతో ఈ స్కాంతో ముడిప‌డివున్న‌రాజ‌కీయ నాయ‌కుల‌ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌నుంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు ఎలా మొద‌లైంది?

ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సెప్టెంబర్‌లో ఈడీ కేసు న‌మోదైంది. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన 15 మంది నిందితులలో మనీష్ సిసోడియా, ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులతోపాటు పలువురు మ‌ద్యం వ్యాపారులు, పంపిణీ దారుల‌ను నిందితులుగా చేర్చింది.

సీబీఐ అధికారుల స‌మాచారం ప్రకారం..

2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలకు సంబంధించి మనీష్ సిసోడియా, డిప్యూటీ సీఎం; అరవ గోపీ కృష్ణ, అప్పటి కమిషనర్ (ఎక్సైజ్); ఆనంద్ తివారీ, అప్పటి డిప్యూటీ కమిషనర్ (ఎక్సైజ్); పంకజ్ భట్నాగర్, అసిస్టెంట్ కమిషనర్ (ఎక్సైజ్); ఆనంద్ తివారీ, అప్పటి డిప్యూటీ కమిషనర్ (ఎక్సైజ్); కీలక పాత్ర పోషించారు.

విజయ్ నాయర్, పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్‌కో స్పిరిట్స్ యజమాని అమన్‌దీప్ ధాల్, మహేంద్రూల పాత్ర‌పై బ‌ల‌మైన ఆధారాల‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

మ‌ద్యానికి సంబంధించి L-1 లైసెన్స్ హోల్డర్ల ద్వారా కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు నిధులు దారి మ‌ళ్లాయ‌ని, ఈ వ్య‌వ‌హారాన్ని క‌ప్పిపుచ్చ‌డానికి త‌ప్పుడు రికార్డులు సృష్టించార‌ని సీబీఐ విచార‌ణ‌లో తేలింది. గుర్గావ్‌లోని బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా; దినేష్ అరోరా, అర్జున్ పాండేలు మనీష్ సిసోడియాకు సన్నిహితులు. మద్యం లైసెన్సుల నుంచి సేకరించిన డబ్బును దారి మళ్లించడంలో చురుకుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు ఒక కోటి మొత్తాన్ని రాధా ఇండస్ట్రీస్ ఖాతాకు బదిలీ చేసినట్లు విచార‌ణ‌లో తేలింది. రాధా ఇండస్ట్రీస్‌ని దినేష్ అరోరా నిర్వహిస్తున్నారు. విజయ్ నాయర్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారుల‌కు డ‌బ్బులు అంద‌జేయ‌డానికి అరుణ్ రామచంద్ర పిళ్లై సమీర్ మహేంద్రుడి నుంచి వసూలు చేశాడ‌ని తేలింది.

ఆప్‌కు పంజాబ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అభిషేక్ బోయిన‌ప‌ల్లి, శ‌ర‌త్ చంద్రారెడ్డి ల కంపెనీ ద్వారా చేరిన‌ట్లు, ఢిల్లీ లిక్క‌ర్ స్కాం డ‌బ్బుల‌నే ఈ రూపంలో దారి మ‌ళ్లించిన‌ట్లు ఈడీ అభియోగాలు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శ‌ర‌త్ చంద్రారెడ్డి కుటుంబానికే చెందిన‌ జోనాల్స్‌ ట్రావెల్స్ ద్వారా ఈ నిధుల మ‌ళ్లింపున‌కు సంబంధించిన ఆధారాలు సేక‌రించిన త‌రువాతే ఈడీ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు ఢిల్లీ అధికారుల స‌మాచారం.

First Published:  10 Nov 2022 1:45 PM IST
Next Story