Telugu Global
National

పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫామ్‌పై రగడ

ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఈ కొత్త యూనిఫామ్‌ను రూపొందించింది.

పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫామ్‌పై రగడ
X

నూతన పార్లమెంట్ భవనంలో ఈ నెల 18 నుంచి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఇరు సభల్లో పని చేసే సిబ్బంది యూనిఫామ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మార్చేసింది. కొత్త పార్లమెంటు భవనంలో ఇకపై కొత్త యూనిఫామ్‌తోనే సహాయక సిబ్బంది నుంచి సెక్యూరిటీ వరకు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. కొత్త యూనిఫామ్ ఇకపై 'భారతీయత'ను సంతరించుకోనున్నదని అధికారులు తెలిపారు. నెహ్రూ జాకెట్స్, ఖాకీ రంగు ప్యాంట్లు, ఇతర అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఈ కొత్త యూనిఫామ్‌ను రూపొందించింది. బ్యూరోక్రాట్లు ధరించే బంధ్‌గాలా సూట్ల స్థానంలో డీప్ పింక్ నెహ్రూ జాకెట్స్.. దానితో పాటు అదే రంగు షర్టు.. దానిపై లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉండనున్నది. అలాగే ఖాకీ రంగు ప్యాంట్లను కూడా సిబ్బందికి అందించారు. అలాగే ఇరు సభల్లో ఉండే మార్షల్స్ డ్రెస్ కూడా కూడా మార్చారు. ఇకపై వారు మణిపూర్ టర్బన్స్ ధరిస్తారని తెలుస్తున్నది. పార్లమెంట్ బిల్డింగ్‌లో పని చేసే సెక్యూరిటీ డ్రెస్‌ను మార్చారు. ఇకపై మిలటరీ సిబ్బంది ధరించే డ్రెస్‌లను పోలి ఉండే డిజైన్‌ను వారికి అందించనున్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం సెప్టెంబర్ 18నే ప్రారంభం అయినా.. ఈ నెల 19న పార్లమెంట్ భవనంలో గణేష్ చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 5 సెషన్లు ఉంటాయని ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

భారతీయత కాదు.. భారతీయ జనతా పార్టీ గుర్తు..

పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫామ్‌పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. భారతీయత పేరుతో సిబ్బంది చొక్కాలపై లోటస్ (తామర) పువ్వును ముద్రించారు. ఇది బీజేపీ పార్టీ గుర్తు అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్‌ను కూడా బీజేపీ వదలడం లేదని మండి పడుతున్నాయి. అసలు కమలం బొమ్మను సిబ్బంది డ్రెస్‌పై ఇప్పుడు ఎందుకు జత చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడ మాణిక్యం ఠాగూర్ ప్రశ్నించారు.

ఒక వేళ జాతీయ పుష్పాన్నే ముద్రించాలని భావిస్తే.. జాతీయ జంతువు పులి, జాతీయ పక్ష నెమలిని మాత్రం ఎందుకు వదిలేశారని.. అవి మీ పార్టీ గుర్తులు కావనే వదిలేశారా అని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంలా భావించే పార్లమెంట్‌ను బీజేపీ కాషాయీకరణ చేస్తోందని మండిపడ్డారు. ఓ బిర్లా (స్పీకర్) గారూ ఇంత దిగజారటం ఎందుకండీ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఆర్జేడీ కూడా ఈ యూనిఫామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ తమ సొంత ఎజెండాతో వ్యవస్థను మొత్తం కాషాయీకరణ చేస్తోందని మండిపడింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పింది.

First Published:  13 Sept 2023 6:32 AM IST
Next Story