గుడిలోకి రానివ్వని పూజారులు... ఇంకా ఎంతకాలం ఈ వివక్ష అన్న హీరోయిన్ అమలా పాల్
''2023లో కూడా మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ విషయం నన్ను చాలా నిరాశపరిచింది. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.''అని అమలా పాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాశారు.

కేరళ ఎర్నాకులంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి ప్రవేశించేందుకు అధికారులు తనకు మతపరమైన వివక్ష కారణంగా అనుమతి నిరాకరించారని నటి అమలా పాల్ ఆరోపించారు.
ప్రాంగణంలోనికి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాలను ఉటంకిస్తూ, ఆలయ అధికారులు ఆమెకు దర్శనం నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు పూజారులు దర్శనం నిరాకరించి, ఆలయం ముందు ఉన్న రహదారి నుండి అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పారని అమలా పాల్ పేర్కొన్నారు.
ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో అమలా పాల్ తన అనుభవాన్ని పంచుకుంది, ఇంకా మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరమని ఆమె అన్నారు.
"2023లో కూడా మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ విషయం నన్ను చాలా నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను. దూరం నుండే ఆమెను మొక్కుకోవాల్సి వచ్చింది. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది. ఏదో ఒక రోజు మనందరిని మతం ప్రాతిపదికన కాకుండా సమానంగా చూస్తారు'' అని అమలా పాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాశారు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే తిరువైరానికుళం మహాదేవ ఆలయ నిర్వాహకులు స్పందించారు. తాము ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్‌లను మాత్రమే పాటిస్తున్నామని వారు తెలిపారు.
ఇతర మతాలకు చెందిన భక్తులు చాలా మంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని, అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని, కానీ, ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రం అది వివాదాస్పదం అవుతుందని ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ అన్నారు.