రేవంత్ అబద్ధాలకు మరాఠ ప్రజలు గుణపాఠం చెప్పారు
రాజకీయ కక్ష సాధింపులకు జార్ఖండ్ ప్రజలు బుద్ధి చెప్పారు : కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలకు మహారాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకున్నా చేసినట్టుగా దొంగ ప్రచారం చేయడంతోనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు. తెలంగాణ మహిళలకు రూ.2,500 ఇవ్వనోళ్లు మహారాష్ట్రలో రూ.3 వేలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు పసిగట్టారని తెలిపారు. రేవంత్ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు ఏవీ కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయన్నారు. అదానీని అక్కడ దొంగ అని.. తెలంగాణలో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. సీఎంగా తన బాధ్యతలపై ఇకనైనా దృష్టి పెట్టాలని, ఆరు గ్యారంటీలు సహా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాబోయేది ప్రాంతీయ పార్టీల శకమే
సార్వత్రిక ఎన్నికల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని, భవిష్యత్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. ఏ రాష్ట్రంలోనూ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవన్నారు. హేమంత్ సోరెన్‌ను వేధించిన కేంద్రానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. జార్ఖండ్ లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా కు, ఆ పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌కు అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ బీజేపీ గెలుపులో కీలకమని.. వారికి అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడుతుందని అన్నారు. హర్యానా, మహారాష్ట్రల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నా అక్కడి ప్రజల మనుసులు గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్నాటకలో మోసపూరిత హామీలతోనే గెలిచిన విషయాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు గమనించారని అన్నారు. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాలతోనే బీజేపీ మనుగడ సాగిస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండొద్దని కుట్రలు చేస్తున్నాయని.. అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేవని తేల్చిచెప్పారు.