Telugu Global
National

ది కేరళ స్టోరీ: నిరూపిస్తే నేను కోటి రూపాయలిస్తా.. అయితే నేను10 కోట్లిస్తా

ఈ మూవీ చెప్తున్నట్టు హిందూ యువతుల బ్రెయిన్ వాష్ చేసి, వారి మతం మార్చి ఐసిస్ లో చేర్పించినట్టు రుజువు చేస్తే తాను కోటి రూపాయల బహుమానం ఇస్తానని కేరళ రాష్ట్ర ముస్లిం యూత్ లీగ్ అధ్యక్షుడు పీకే ఫిరోజ్ ప్రకటించారు.

ది కేరళ స్టోరీ: నిరూపిస్తే నేను కోటి రూపాయలిస్తా.. అయితే నేను10 కోట్లిస్తా
X

'ది కేరళ స్టోరీ' మూవీ కేరళలో దుమారం రేపుతోంది. మే 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ప్రజల మధ్య విభజనలు సృష్టించి, మతకలహాలను రెచ్చగొట్టనుంద‌ని సీపీఎం, కాంగ్రెస్ లు వాదిస్తుండగా ఇప్పుడు ఆ మూవీకి మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగింది. మరో వైపు ఈ మూవీకి వ్యతిరేకంగా కేరళలో నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి.

2018, 19 నడుమ కేరళలో 30 వేల మంది హిందూ యువతులకు బ్రెయిన్ వాష్ చేసి వారిమతం మార్చి ఐసిస్ లో చేర్పించారని ప్రచారం చేస్తున్న 'ది కేరళ స్టోరీ' మూవీపై నెటిజ‌నులు కూడా తీవ్రంగా విరుచుకపడుతున్నారు. ఆరెస్సెస్ చేస్తున్న అభూత కల్పనలను నిజాలుగా నమ్మించేందుకు ఈ మూవీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం ఆరోపిస్తున్నది.

మరో వైపు ఈ మూవీ చెప్తున్నట్టు హిందూ యువతుల బ్రెయిన్ వాష్ చేసి, వారి మతం మార్చి ఐసిస్ లో చేర్పించినట్టు రుజువు చేస్తే తాను కోటి రూపాయల బహుమానం ఇస్తానని కేరళ రాష్ట్ర ముస్లిం యూత్ లీగ్ అధ్యక్షుడు పీకే ఫిరోజ్ ప్రకటించారు.

మతం మార్చుకొని ఐసిస్ లో చేరిన యువతుల పేర్లతో సహా లిస్ట్ ఇస్తే తాను 11 లక్షల రూపాయలు ఇస్తానని నటుడు, లాయర్ షుక్కుర్ ప్రకటించగా , మూవీ కథ నిజంగా జరిగినట్టు ఆధారాలు సమర్పిస్తే తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని నజీర్ హుస్సేన్ అనే నెటిజన్ ప్రకటించారు.

అయితే వీరికి పోటీగా ఈ మూవీ కథ జరగలేదని నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానని రైట్-వింగ్ కార్యకర్త , హిందూ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు ప్రతీష్ విశ్వనాథ్ ఆఫర్ చేశారు.

కాగా, రాష్ట్రంలో మతోన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి, విభజనలను సృష్టించడానికి సినిమాని ఉపయోగించడాన్ని వాక్ ,భావప్రకటనా స్వేచ్ఛ సమర్థించదని కేరళ సిఎం అనడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఇది సీఎం ద్వంద్వ ప్రమాణాలు గా బీజేపీ అభివర్ణించింది.

దీనిపై కాంగ్రెస్‌కు చెందిన తిరువనంతపురం ఎంపి శశి థరూర్ మాట్లాడుతూ, ఈ చిత్రం అబద్దాలను ప్రచారం చేస్తున్నదని గట్టిగా, స్పష్టంగా చెప్పే హక్కు కేరళీయులకు ఉందని అన్నారు. "భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతో నేను సినిమాపై నిషేధం విధించాలని కోరడం లేదు. అయితే ఆ మూవీ వాస్తవాలనుతప్పుగా చూపిస్తుందనే విషయాన్ని గట్టిగా, స్పష్టంగా చెప్పే హక్కు కేరళీయులకు ఉంది. " అని ఆయన ట్వీట్ చేశారు.

మరో వైపు, ఈ మూవీని బ్యాన్ చేయడానికి ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) సిద్దంగా లేదు. సినిమాను థియేటర్లలో బ్యాన్ చేసినా OTT ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించవచ్చు కాబట్టి సినిమాను నిషేధించడం వ్యర్థం అని FEUOK ప్రతినిధులు పేర్కొన్నారు .

First Published:  2 May 2023 8:51 AM GMT
Next Story