Telugu Global
National

కేరళ స్టోరీ.. ఆ చర్చ ఇక్కడ కాదన్న సుప్రీం

హైకోర్టుల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు ఉన్నారని, స్థానిక అంశాలపై వారికి మంచి అవగాహన ఉంటుందని పేర్కొంది. ఇదే సినిమాకు సంబంధించిన ఇతర పిటిషన్ల విచారణను కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు.

కేరళ స్టోరీ.. ఆ చర్చ ఇక్కడ కాదన్న సుప్రీం
X

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'ది కేరళ స్టోరీ' సినిమా రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా ట్రైలర్ తో రచ్చ మొదలైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందంటూ వివిధ రాజకీయ పార్టీల నేతలు, మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సినిమా ప్రదర్శన ఆపేయాలన్నారు. 'ది కేరళ స్టోరీ'ని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే విచారణకు సుప్రీం నిరాకరించింది. తగిన కోర్టుకి వెళ్లాలని, ఈ చర్చ సుప్రీంలో పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. హైకోర్టుల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు ఉన్నారని, స్థానిక అంశాలపై వారికి మంచి అవగాహన ఉంటుందని పేర్కొంది. ఇదే సినిమాకు సంబంధించిన ఇతర పిటిషన్ల విచారణను కూడా తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లే అంశాన్ని పిటిషనర్ల నిర్ణయానికే విడిచిపెట్టింది సుప్రీం.

కేరళలో వేల సంఖ్యలో హిందూ యువతులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, వారిని ఐసిస్‌ ఉగ్రముఠాలో చేర్చుతున్నారని, ఉగ్రదాడులకు వాడుకుంటున్నారని సినిమా ట్రైలర్ లో చూపించారు. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సినిమా అంటూ మండిపడ్డారు సీఎం పినరయి విజయన్. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలకు దిగాయి. జమియత్‌-ఉలమా-ఎ-హింద్‌ సంస్థ ఈ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమా సమాజంలో భిన్నవర్గాల మధ్య విద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచేలా ఉందని ఆ సంస్థ తమ వాదనలు వినిపించింది. అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది సుప్రీం.

తమిళనాట నిఘా వర్గాల హెచ్చరిక..

తమిళనాడులో 'ది కేరళ స్టోరీ' విడుదలయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతుందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. సినిమా విడుదల కాకుండా ఆపేస్తేనే మంచిదని సిఫారసు చేశారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో సీఎం స్టాలిన్‌ చర్చిస్తారని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని పోలీసు వర్గాలంటున్నాయి.

First Published:  4 May 2023 1:29 AM GMT
Next Story