Telugu Global
National

ఐసిస్ లో చేరింది 32వేల మంది మహిళలు కాదు ముగ్గురే... మాటమార్చిన 'ది కేరళ స్టోరీ' మూవీ బృందం

పలు చోట్ల వివిధ ప్రజాసంఘాలు ఈ మూవీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా మేదావుల నుండి కూడా ఈ మూవీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం యూ ట్యూబ్ లోని తమ డిస్క్రిప్షన్ ను మార్చేసింది.

ఐసిస్ లో చేరింది 32వేల మంది మహిళలు కాదు ముగ్గురే... మాటమార్చిన ది కేరళ స్టోరీ మూవీ బృందం
X

'ది కేరళ స్టోరీ' మూవీ లో చూపిస్తున్న అబద్దాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆ మూవీ బృందం మాట మార్చింది. కేరళ నుండి 32,000 మంది మహిళలు ఇస్లామిక్ స్టేట్ (IS)లో చేరారనే వారి వాదనను గుట్టుచప్పుడు కాకుండా మార్చేశారు.

యూ ట్యూబ్ లో ఆ మూవీ ట్రైలర్ డిస్క్రిప్షన్ లో "కేరళలోని 32000 మంది స్త్రీల హృదయ విదారకమైన కథలు" అని ఉన్న డిస్క్రప్షన్ ను మార్చేసి, ''ఈ చిత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల నిజ జీవిత కథల ఆధారంగా రూపొందించబడింది.'' అని రాశారు.

కేరళ స్టోరీ చిత్ర బృందం చేసిన ఈ మార్పును హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజనులు ఆ మూవీపై దుమ్మెత్తి పోస్తున్నారు.

''ఇప్పటి వరకు 32 వేల మంది మహిళలు తప్పిపోయారని ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

''ఇప్పటికైనా నిజాలు ఒప్పుకున్నందుకు మూవీ యూనిట్ కు ధన్యవాదాలు'' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

''తప్పుడు ప్రచారంతో కేరళలో మత చిచ్చు రగల్చడానికి పయత్నించిన మూవీ యూనిట్ పై చర్యలు తీసుకోవాలి.'' అని మరో నెటిజన్ డిమాండ్ చేశారు.

ఈ చిత్రంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు, నాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఒకరకంగా ప్రజలపై దాడి అని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆరోపించారు. తమ రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, విద్వేషాన్ని నూరిపోయడానికి సంఘ్ పరివార్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ మూవీ అని విజయన్ మండిపడ్డారు.

మరో వైపు, 32,000 మంది యువతులు మతం మారారని, ఐసిస్ లో చేరారని రుజువు చేస్తే కోటి రూపాయల రివార్డును ఇస్తామని కేరళ రాష్ట్ర ముస్లిం యూత్‌ లీగ్‌ ప్రకటించింది.

పలు చోట్ల వివిధ ప్రజాసంఘాలు ఈ మూవీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. దేశవ్యాప్తంగా మేదావుల నుండి కూడా ఈ మూవీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం యూ ట్యూబ్ లోని తమ డిస్క్రిప్షన్ ను మార్చేసింది.

First Published:  3 May 2023 11:39 AM IST
Next Story