సహజీవనానికి విడాకులు ఇవ్వలేం- హైకోర్టు
కేరళలో హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన జంట 2006 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు వారు విడిపోవాలనుకున్నారు.
సహజీవనం చేసిన ఒక జంట తమకు చట్టప్రకారం విడాకులు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. పరస్పర అవగాహనతో ఒక జంట చేసిన సహజీవనానికి చట్టప్రకారం విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
సహజీవనంలో ఉన్న ఇద్దరూ పరస్పరం అవగాహనతో ముందుకెళ్లారే గానీ.. చట్టబద్దంగా వారు వివాహం చేసుకోలేదని ప్రస్తావించింది. అలాంటప్పుడు చట్టప్రకారం వారి సహజీవనాన్ని వివాహం గుర్తించడం సాధ్యం కాదని, అలాగే వారికి విడాకులు ఇవ్వడం కూడా సాధ్యం కాదని వివరించింది.
వివాహం అనేది సమాజంలో నైతిక ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడింది. చట్టాలు గుర్తించిన విధంగా వివాహం చేసుకోనప్పుడు, వారు విడిపోవడాన్ని కూడా అధికారింగా గుర్తించడం సాధ్యం కాదని చెప్పింది.
కేరళలో హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన జంట 2006 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు వారు విడిపోవాలనుకున్నారు. తమకు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం విడాకులు ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే వారు ప్రత్యేక వివాహ చట్టం ఆధారంగా వివాహం చేసుకోకుండా కేవలం పరస్పర అవగాహనతో సహజీవనం చేస్తున్నట్టు కింది కోర్టు గుర్తించింది. దాంతో విడాకులు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దాంతో ఆ జంట కేరళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా వారి వినతిని తిరస్కరించింది.
రెండు భిన్న సమూహాలకు చెందిన వ్యక్తులు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కాకుండా కేవలం ఒప్పందం ద్వారా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని వారు వివాహంగా చెప్పుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి విడాకులు కోరేందుకే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది.