జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు దేశంలో విద్వేషాన్ని నింపుతోంది: రాహుల్ గాంధీ
నాడు జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు, కర్నాటకలో ఈ రోజు సాగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
దేశానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడు ప్రజలను జాగృతం చేసిన విధంగానే మేము ఈనాడు "భారతదేశాన్ని ఏకం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. "బాపు మాకు సత్యం , అహింస మార్గంలో నడవాలని నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని ఆయన వివరించారు" అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.
బాపూజీ చూపిన బాటలోనే దేశ ప్రజలను ఏకం చేసేందుకు ముందుకు కదులుతున్నాము. ఆయన మార్గం మాకు ఆదర్శం అంటూ రాహుల్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన భారత జోడో యాత్రా విశేషాల వీడియోతో పాటు మహాత్మా గాంధీ మాంటేజ్ ను సామాజిక మాద్యమంలో షేర్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులోని బదనవాలు గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సందర్భంగా రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1932లో ఉత్పత్తి ప్రారంభించిన ఖాదీ సహకార సంస్థను కూడా ఆయన సందర్శించాడు. మహాత్మా గాంధీ 1928లో, 1932లో రెండుసార్లు ఈ యూనిట్‌ను సందర్శించారు.
ఉదయం గాంధీజీ విగ్రహం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి రాహుల్ గాంధీ నివాళులు అర్పించడంతో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది, అనంతరం బదనవాలులోని ఖాదీ గ్రామోద్యోగ్‌లో ప్రార్థనా సమావేశం జరిగింది. భారత్ జోడో యాత్ర ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో మొక్కలు నాటారు.
కర్నాటకలో పర్యటన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, నాడు జాతిపితను చంపిన సిద్ధాంతమే ఇప్పుడు ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానత్వం, విభజనవాదాన్ని వ్యాప్తి చేస్తోందని.. కష్టపడి సంపాదించుకున్న మన స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. ఇప్పుడన్నీ హింసా రాజకీయాలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయని.. వాటికి వ్యతిరేకంగా గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్ జోడో యాత్రలో ప్రచారం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.
''భారతదేశాన్ని ఒక్కటి చేయాలన్న లక్ష్యం నెరవేరాలంటే మీ ఆదర్శాలతో పాటు మీ ఆశీస్సులు కూడా అవసరం. దేశంలో చీకటి అలుముకున్నఈ తరుణంలో ప్రేమ, కరుణ, అహింస, సౌభ్రాతృత్వపు జ్యోతిని వెలిగించే శక్తిని మాకు అందరికీ అందించండి. అన్యాయం, ద్వేషం ఎప్పటికైనా మాయమైపోతాయి" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
కాగా సెప్టెంబర్ 7 వ తేదీన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ తలపెట్టిన భారత్ జో్డో యాత్ర 25రోజులుగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజలనుంచి విశేషమైన స్పందన వస్తోంది.