మూక దాడి నుంచి ముగ్గురిని రక్షించిన వ్యక్తి ఇంటినే కూల్చేశారు.. హర్యానాలో వెలుగులోకి వచ్చిన దారుణం
రాజస్థాన్‌లోని ఖైర్తాల్‌కు చెందిన అనీశ్.. మూడేళ్ల క్రితం నుహ్ పట్టణానికి వచ్చాడు. అక్కడే రెండు ట్రక్కులను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, ఇప్పుడు తప్పుడు ఆరోపణలతో సొంత ఇంటిని కోల్పోయాడు.
అల్లరి మూక దాడిలో ప్రాణాలు పోతాయేమో అనే భయంతో ఉన్న ముగ్గురికి ఆశ్రయం ఇచ్చాడు. కాస్త ఆహారం ఇచ్చి కొన్ని స్వాంతన చేకూర్చే మాటలు చెప్పాడు. వాళ్లు వచ్చిన వాహనాన్ని మూక ధ్వంసం చేయడంతో.. తన కారులో స్వయంగా సురక్షిత ప్రాంతానికి తరలించాడు. సీన్ కట్ చేస్తే.. ఆరు రోజుల తర్వాత మూక దాడులకు పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చాడనే సాకుతో.. అతడి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేశారు. ఆశ్రయం పొందిన వారు నిజం చెప్పడానికి ప్రయత్నించినా.. అప్పటికే ఆ ఇంటి గోడలు కూలిపోయాయి. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హిస్సార్‌కు చెందిన రవీందర్ ఫొగట్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి గత నెల 31న బద్కాలి నుంచి నుహ్ వైపు కారులో ప్రయాణిస్తున్నాడు. కాంట్రాక్టర్ అయిన రవీందర్.. నుహ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కొత్త రోడ్డు వేయడానికి ఇచ్చిన టెండర్‌ను పరిశీలించడానికి బద్కాలి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా నుహ్‌లోని జెండా పార్క్ వద్ద కొత మంది ఆ కారుపై రాళ్లు రువ్వారు. వారి నుంచి తప్పించుకోవడానికి ముందుకు వెళ్లిపోయాడు. అయితే గురుగావ్ - అల్వార్ జాతీయ రహదారిలోని ఒక టైల్స్ షాపు వద్ద కొంత మంది అల్లరి మూక గుమి కూడినట్లు గమనించారు. ముందుకు వెళ్తే ప్రాణహాని ఉంటుందేమో అనే భయంతో కారును పక్కకు పెట్టి.. రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంటిలోకి వెళ్లాడు.
చిన్న వ్యాపారి అయిన అనీశ్ అనే వ్యక్తిది ఆ ఇల్లు అని తెలుసుకున్నాడు. ఇంటి యజమాని ముస్లిం అని తెలుసుకొని తొలుత భయపడ్డారు. కానీ అనీశ్ వారిని సాదరంగా ఆహ్వానించి.. తినడానికి ఆహారం ఇచ్చాడు. కాసేపు వారితో మాట్లాడి.. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాడు. అప్పటికే అల్లరి మూక బయట ఉన్న వారి కారుకు నిప్పు పెట్టారు. మూక అక్కడి నుంచి వెళ్లే వరకు అనీశ్ ఇంటిలోనే గడిపారు. ఆ తర్వాత అనీశ్ కారులో ముగ్గురినీ నుహ్ పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి దింపాడు. రవీందర్ సహా మిగిలిన ఇద్దరూ అక్కడి నుంచి గురుగావ్ వెళ్లి.. తర్వాతి రోజు సోహ్నా బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ కారులో సొంత ఊరైన హిస్సార్ వెళ్లిపోయారు. వాళ్లు నుహ్ నుంచి వెళ్లే ముందు అనీశ్‌కు తన నంబర్ ఇచ్చి.. ఎప్పుడైనా కుటుంబంతో తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు.
కాగా, జూలై 31న విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన బ్రిజ్‌మండల్ జలాభిషేక్ యాత్ర సమయంలో జరిగిన అల్లర్లలో కారకులైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా రాళ్లు రువ్విన ఘటనలో కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటికే హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాళ్లు రువ్విన మూకలో అనీశ్ కూడా ఉన్నాడనే తప్పుడు సమాచారం అందింది. కొంత మంది అల్లరి మూకకు అతడు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడనే కారణంతో.. బుల్డోజర్లతో అనీశ్ ఇంటిని కూల్చేశారు. కాగా, తాను ఆశ్రయం ఇచ్చిన రవీందర్‌కు కాల్ చేసి.. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఇంటిని కూల్చేస్తున్నారని.. పోలీసులకు మీరైనా చెప్పాలంటూ అభ్యర్థించాడు.
కాంట్రాక్టర్ రవీందర్‌కు ఉన్న పోలీస్, పొలిటికల్ కాంటాక్ట్స్ ఉపయోగించి అనీశ్ పరిస్థితిని వివరించాడు. తనతో పాటు ఇద్దరు స్నేహితులకు అనీశ్ ఆశ్రయం ఇచ్చి కాపాడాడని పోలీసులకు చెప్పాడు. కానీ అప్పటికే ఇంటి గోడలను కూల్చేసే ప్రక్రియ జరిగిపోయింది. కోర్టు జోక్యంతో ఆ కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
కాగా, ఇంటిని కూల్చేస్తున్నామని తనకు ఎవరూ ముందస్తుగా నోటీసులు ఇవ్వలేదని.. తనకు ఆ రోజు జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని అనీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని ఖైర్తాల్‌కు చెందిన అనీశ్.. మూడేళ్ల క్రితం నుహ్ పట్టణానికి వచ్చాడు. అక్కడే రెండు ట్రక్కులను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, ఇప్పుడు తప్పుడు ఆరోపణలతో సొంత ఇంటిని కోల్పోయాడు.